- 56 మంది పేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
- జగిత్యాల జిల్లాకు చెందిన సామాజిక సేవకుడు రమేశ్ కృషి
జగిత్యాల టౌన్ (ధర్మపురి) వెలుగు: జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్ నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. దాతలు రూ.2.71 లక్షల విరాళాలు ఇవ్వగా.. వాటితో 56 మంది పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ధర్మపురి, బీర్పూర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సోమవారం స్థానిక టీటీడీ అతిథిగృహంలో సైకిళ్లను పంపిణీ చేశారు.
జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ ముఖ్య అతిథిగా హాజరై అందజేసి మాట్లాడారు. సోషల్ మీడియాను నిరుపేదల సేవకు వినియోగించడం అభినందనీయమని పేర్కొన్నారు. సైకిళ్లు పొందిన విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పదేండ్లుగా ఫేస్‌బుక్ ద్వారా దాతలు నిరంతరం సహకారం అందించడం గొప్ప విషయమని ప్రశంసించారు.
పోలీస్ శాఖ తరఫున మరో ఇద్దరు పేద విద్యార్థులకు సాయం అందిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పాల్గొన్న దేవస్థానం ఈవో శ్రీనివాస్ తన వంతుగా ఒక విద్యార్థికి సైకిల్ అందిస్తానని వెల్లడించారు. సీఐ రాం నరసింహారెడ్డి, ఎస్ఐ మహేశ్, ఎంఈఓ సీతాలక్ష్మి, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు
పాల్గొన్నారు.
