మండలిలోకి సెల్ఫోన్లు బ్యాన్..సభ్యులకు కౌన్సిల్ చైర్మన్ గుత్తా ఆదేశాలు

మండలిలోకి సెల్ఫోన్లు బ్యాన్..సభ్యులకు కౌన్సిల్ చైర్మన్ గుత్తా ఆదేశాలు
  •     దివంగత సభ్యులు జగపతిరావు, పీర్ షబ్బీర్ మృతికి సభ నివాళి
  •     కౌన్సిల్ లో ప్రత్యేక అంశాల ప్రస్తావించిన సభ్యులు
  •     గల్ఫ్ కార్మికుల కోసం పాలసీ తీసుకురావాలి: తీన్మార్ మల్లన్న
  •     21 రకాల వైకల్యాలపై అవగాహన కల్పించాలి:దాసోజు

హైదరాబాద్, వెలుగు: సభలోకి సెల్ ఫోన్లు తీసుకురావద్దని కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి మండలి సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ​ఉదయం చైర్మన్ గుత్తా అధ్యక్షతన కౌన్సిల్ సమావేశమైంది. సభలో సభ్యులు సెల్​ఫోన్​తో రావడాన్ని గుర్తించిన చైర్మన్ ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా దివంగత సభ్యులు మాధవరం జగపతి రావు, అహ్మద్ పీర్ షబ్బీర్ మృతిపట్ల చైర్మన్ సంతాప తీర్మానం ప్రకటించారు. 

సభ్యుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. వారి మృతికి సంతాపంగా సభలో సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత కౌన్సిల్ లో సభ్యులు  ప్రత్యేక అంశాలు ప్రస్తావించగా మంత్రులు గడ్డం వివేక్​వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల శ్రీనివాస్ రావు నోట్ చేసుకుని సంబంధిత శాఖల దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

బీఆర్ఎస్ సభ్యురాలు సురభి వాణీదేవి మాట్లాడుతూ పీవీ సొంత గ్రామం వంగరలో ప్రభుత్వ స్కూల్​లో వసతులు లేవని ప్రస్తావించారు. ఆటిజం బాధితులకు పెయింటింగ్ శిక్షణ కల్పించాలని కోరారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ రజకుల ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరారు.

 సీపీఐ సభ్యుడు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. రీజనల్ రింగ్​రోడ్ స్థల సేకరణలో బాధిత చిన్న రైతులకు సరైన నష్టపరిహారం అందడం లేదని , ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఉదయం 10.30 గంటల నుంచి 11.10 గంటల వరకు జరిగిన సభ అనంతరం చైర్మన్ గుత్తా జనవరి 2వ తేదీకి సభను వాయిదా వేశారు.

21 రకాల వైకల్యాలపై అవగాహన కల్పించాలి: దాసోజు శ్రవణ్

దివ్యాంగుల చట్టం ఆర్​పీడబ్ల్యూడీ పై అవగాహన కల్పించడంతో పాటు, రిహాబిలిటేషన్ కల్పించాలని కోరారు. స్కూళ్లు, కాలేజీల్లోనే ఆటిజం లాంటి రుగ్మతలను ముందస్తుగా గుర్తించాలని అన్నారు. 21 రకాల వైకల్యాలపై అవగాహన కల్పించాలన్నారు. శారీరక, మానసిక వైకల్యం వారి ఎదుగుదలకు అవరోధం కాకూడదని, చిన్నప్పుడే పిల్లల్లో లోపాలను గుర్తిస్తే వాటిని సరిచేసి వారికి మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం ఉందన్నారు. 

థెరపీలు పేదలకు అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వ థెరపీ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. వైకల్యం, ఆటిజం ఉన్న దివ్యాంగుల పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఆర్​పీడబ్ల్యుడీ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కోరారు.

ప్రవాసులకు భద్రత కల్పించాలి: తీన్మార్ మల్లన్న

గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు కేరళ తరహా పాలసీ తీసుకురావాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. గతేడాది కాలంలో 1,600మంది గల్ఫ్ కార్మికులు చనిపోయారని తెలిపారు. అక్కడ చనిపోయిన వారి డెడ్​బాడీని తీసుకురావడానికి 15రోజులకు పైగా పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెంట్ల మోసాలను అరికట్టాలనీ, ప్రవాసులకు భద్రత కల్పించాలన్నారు. ప్రత్యేక ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురావాలనీ కోరారు. తాను సభలో 47 పిటిషన్లు ఇస్తే కేవలం నాలుగు సమాధానాలు ఇచ్చారని చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు.

భారీ బిల్డింగ్స్ కోసం హైడ్రాలిక్ యంత్రాలు లేవు: అంజిరెడ్డి

భారీ భవనాలకు అవసరమయ్యే ఫైర్ ఎక్విప్​మెంట్​లు, ఫైర్ హైడ్రాలిక్ లిఫ్ట్ యంత్రాలు లేవు. ప్రమాదం జరిగితే ప్రాణాలు కాపాడడం కష్టమని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2016 చట్టం ప్రకారం ప్రతీ 10 ఫ్లోర్ల ఓపెన్​ ఏరియా ఉండాలని ఇవేవి అమలు కావడం లేదన్నారు. చాలా ప్రభుత్వ ఆఫీసుకు సొంత భవనాలు లేవు. ఓయూకు వెయ్యి కోట్లు ప్రకటించారనీ, మిగతా 11వర్సిటీల సంగతేంటనీ ప్రశ్నించారు. 

స్కూళ్లలో కనీస సౌలత్​లు లేవు: మల్క కొమరయ్య

ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనీ బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రస్తావించారు. ‘2024-–25 అకడమిక్ ఇయర్ లో రాష్ట్రంలో 2,245 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదన్నారు. విద్యార్థులు ఉన్న చోట టీచర్ల కొరత ఉన్నది.. టీచర్లు ఉన్న చోట విద్యార్థులు లేరని, రేషనలైజేషన్ చేయాలన్నారు. 

మోడల్ స్కూల్స్, కస్తూర్బావిద్యాలయాల్లో ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న టీచర్లకు పే స్కేలుతో పాటు రెగ్యులరైజ్​ చేయాలన్నారు. రాష్ట్రంలో డీఏలు పెండింగ్ లో ఉన్నాయనీ, పీఆర్సీ ఇవ్వలేదనీ, దాదాపు 14 వేల మంది పెన్షనర్ల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.