మూడు విడుతల్లో ఎంసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్

మూడు విడుతల్లో ఎంసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్​లో 80.41% మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్​లో 88.34% మంది క్వాలిఫై అయ్యారు. ఈ రెండు విభాగాల్లోనూ అమ్మాయిల హవానే కొనసాగింది. శుక్రవారం జేఎన్టీయూహెచ్​లో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ , కౌన్సిల్ సెక్రటరీ శ్రీనివాస్ రావుతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. 

ఇంజనీరింగ్ కేటగిరీలో​లో టాప్​ టెన్ ర్యాంకుల్లో 8 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్​లో ఏడు ర్యాంకులను అబ్బాయిలు సొంతం చేసుకున్నారు. మరోపక్క ర్యాంకుల్లో ఏపీ స్టూడెంట్లు సత్తా చాటారు. టాప్ టెన్ ర్యాంకుల్లో ఇంజినీరింగ్​లో ఇద్దరు, అగ్రికల్చర్ అండ్ మెడికల్​లో ముగ్గురు మాత్రమే తెలంగాణ స్టూడెంట్లున్నారు. మిగతా వాళ్లంతా వాళ్లే.  ఫలితాలు రిలీజ్ చేసిన అనంతరం మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. వర్షాలతో ఎంసెట్ వాయిదా వేసినా, మళ్లీ విజయవంతంగా నిర్వహించామన్నారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల వివరాలను తెలుసుకునేందుకు వీలుగా హయ్యర్ ఎడ్యుకేషన్  కౌన్సిల్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ర్యాంకర్లందరికీ మంత్రి అభినందనలు చెప్పారు. మొత్తం మూడు విడుతల్లో ఎంసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఉంటుందని, ఈనెల 21 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని అధికారులు వెల్లడించారు.

ఇంజనీరింగ్​లో1,26,140 మంది క్వాలిఫై

ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 1,56,860 మంది పరీక్ష రాయగా 1,26,140 (80.41%) మంది క్వాలిఫై అయ్యారు. దీంట్లో 95,765 మంది అబ్బాయిలు అటెండ్ కాగా 75,842 (79.19%) మంది అర్హత సాధించారు. అమ్మాయిలు 61,095 మంది పరీక్ష రాయగా, 50,298 (82.32%) మంది క్వాలిఫై అయ్యారు. ఇందులో ఓసీ కేటగిరీలో 49,948 మంది అటెండ్ కాగా, 39,554 మంది అర్హత సాధించారు. ఎస్సీలు 15,909 మంది, ఎస్టీలు 9,541 మంది పరీక్ష రాయగా అంతా అర్హత సాధించారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ కేటగిరీలో 80,575 మంది పరీక్ష రాయగా, 71,180 (88.34%) క్వాలిఫై అయ్యారు. దీంట్లో బాయ్స్ 24,667 మంది అటెండ్ కాగా 21,329(86.46%) మంది, అమ్మాయిలు 55,908 మంది పరీక్ష రాస్తే 49,851(89.16%) మంది అర్హత సాధించారు. ఓసీలు 12,662 మంది ఎగ్జామ్ రాయగా 10,550 మంది క్వాలిఫై అయ్యారు. ఎస్సీలు 16,897 మంది, ఎస్టీలు 8490 మంది  రాయగా అందరూ అర్హత సాధించారు. 

ఇంజినీరింగ్ టాప్ ర్యాంకర్లు 
ర్యాంక్ టాపర్ పేరు  ప్రాంతం 

1    పి.లక్ష్మీసాయి లోహిత్​రెడ్డి     ఒంగోలు 
2    నక్క సాయిదీపిక                    శ్రీకాకుళం 
3    పొలిశెట్టి కార్తికేయ                గుంటూరు 
4    పల్లి జలజాక్షి                      శ్రీకాకుళం 
5    ఎం.హిమవంశీ                  శ్రీకాకుళం  

అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ ర్యాంకర్లు
ర్యాంక్     టాపర్ పేరు     ప్రాంతం 

1    జే.నేహా                       గుంటూరు 
2    వీ.రోహిత్                    విశాఖపట్నం 
3   కే.తురుణ్ కుమార్      గుంటూరు 
4     కే.మహితీ అంజన్     కూకట్ పల్లి,  హైదరాబాద్ 
5     జీ.శ్రీరామ్                   గుంటూరు