ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై కీలక సమావేశం

ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై కీలక సమావేశం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. క్యాంపస్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ఆమె తన కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నత విద్యామండలి అధికారులు పాల్గొంటున్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో జరిపిన  చర్చల సారాంశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకుంటున్నారు.  అనంతరం మాట్లాడిన సబిత.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అనవసరంగా ఆందోళన చెందొద్దని అన్నారు. చిన్న  విషయాలను కూడా  పెద్ద సమస్యలుగా చూపడం సరికాదని అన్నారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు విద్యార్థుల 12 డిమాండ్లు చాలా సిల్లీగా ఉన్నాయన్న సబిత రేపటి నుంచి అందరూ క్లాసులకు అటెండ్ కావాలని సూచించారు. 

మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలెక్టర్ జరిపిన చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. సమస్యలకు సరైన పరిష్కారం చూపకపోవడంతో విద్యార్థులు చర్చల నుంచి బయటకు వచ్చేశారు. కేవలం రూ.10లక్షల విలువైన పనులకు నిధులు కేటాయిస్తామని కలెక్టర్ చెప్పడం, సీఎం కేసీఆర్ క్యాంపస్ ను సందర్శించే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంపై స్టూడెంట్స్ అంసతృప్తి వ్యక్తంచేశారు. చర్చలు విఫలం కావడంతో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలని నిర్ణయించారు. 12 డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు విద్యార్థులతో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. గురువారం నుంచి సోషల్ మీడియా వేదికగానూ ఉద్యమాన్ని కొనసాగించనున్నట్లు ప్రకటించారు.