డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సు

డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సు
  • డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సు
  • స్టూడెంట్లలో ఒత్తిడిని తగ్గించేందుకు సీసీఈ విధానం : సబితా ఇంద్రారెడ్డి 

హైదరాబాద్, వెలుగు : ప్రస్తుతం సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా హయ్యర్ ఎడ్యుకేషన్​లో సమూల మార్పులు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మూసపద్ధతిలో కాకుండా, కాలానుగుణంగా కొత్త కోర్సులు తీసుకొస్తున్నామని చెప్పారు. సోమవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణతో కలిసి డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సును మంత్రి ప్రారంభించారు. దీంతో పాటు ఎగ్జామ్స్, వాల్యుయేషన్​లో మార్పులను సూచిస్తూ ఐఎస్​ బీ ఇచ్చిన రిపోర్టును ఆమె రిలీజ్ చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, వీటిపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఏడాది నుంచే డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. అలాగే, హయ్యర్ ఎడ్యుకేషన్​లో స్టూడెంట్లపై ఒత్తిడిని తగ్గించేందుకు, బట్టీ చదువులకు స్వస్తి చెప్పేందుకు డిగ్రీ కాలేజీల్లోనూ నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానాన్ని అమలు చేయబోతున్నట్టు మంత్రి వివరించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇచ్చిన రిపోర్టుపై అధ్యయనం చేసి, అమలు చేసేందుకు కమిటీని వేయాలని సూచించారు. 

హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. సైబర్ సెక్యూరిటీ కోర్సులో ఫోర్త్ సెమిస్టర్​లో దీనిపై ఒక పేపర్ ఉంటుందని, నాలుగు క్రెడిట్స్ ఉంటాయని తెలిపారు. సీసీఈ విధానం ద్వారా ఫ్రెండ్లీ లర్నింగ్ ఉండబోతుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్లు వెంకటరమణ, మహమూద్, వీసీలు రవీందర్, గోపాల్ రెడ్డి, విజ్జులత, నల్సార్ లా వర్సిటీ ప్రొఫెసర్ శాంతి, ఐఎస్​బీ ప్రతినిధులు పాల్గొన్నారు.