
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 36 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను(కేజీబీవీ) ఇంటర్మీడియట్‌కు అప్‌గ్రేడ్ చేయనున్నట్టు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ ఏడాది నుంచే వాటిల్లో ఫస్టియర్ క్లాసులు ప్రారంభం అవుతాయని చెప్పారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ గ్రూపులను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ఒక్కో గ్రూప్‌లో40 సీట్లుంటాయని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 475 కేజీబీవీలు ఉండగా, ఇప్పటికే 172 కేజీబీవీలను ఇంటర్‌కు అప్‌గ్రేడ్ చేసినట్టు స్పష్టం చేశారు. వీటిల్లో చేరిన స్టూడెంట్లకు పౌష్టికాహారంతో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించనున్నట్టు వెల్లడించారు. చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు, కరాటే, యోగా, ధ్యానం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బాలికలను కోరారు. కాగా, ఇప్పటికే ఆయా కేజీబీవీల్లో ఫస్టియర్‌లో1,600 మంది స్టూడెంట్లు అడ్మిషన్లకు రెడీగా ఉన్నట్టు విద్యా శాఖ అధికారులు మంత్రికి చెప్పారు.