రాజ్ భవన్ కు కేసీఆర్ ఎప్పుడు వెళ్లాలనేది ఆయన ఇష్టం 

రాజ్ భవన్ కు కేసీఆర్ ఎప్పుడు వెళ్లాలనేది ఆయన ఇష్టం 

హైదరాబాద్ : రాజ్ భవన్ కు ప్రగతిభవన్ కు మధ్య దూరం ఎక్కడా పెరగలేదని గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ తన పరిధిని ధాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో రాష్ట్రంలో (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ఎంతో మంది గవర్నర్లు పని చేశారని, వారితో రాని ఇబ్బంది ఇప్పుడున్న గవర్నర్ తమిళి సైతో ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. తమిళి సైకు గవర్నర్ పదవీ ఎలా అర్హత ఉందన్నారు. కేంద్రానికి మద్దతుగా, బీజేపీ పార్టీ ప్రతినిధిగా మాట్లాడం సరైంది కాదన్నారు. రాజ్ భవన్ కు కేసీఆర్ ఎప్పుడు వెళ్లాలన్న విషయం ముఖ్యమంత్రి ఇష్టమన్నారు.

పద్ధతి మార్చుకోండి..

‘భద్రాచలంలో భారీ వరదలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉండగా మీకేం పని. అక్కడకు ఎందుకు వెళ్లారు’ అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ చరిత్ర గవర్నర్ కు తెలియదని, అందుకే విమోచనం అంటున్నారని అన్నారు. లేని సమస్యలను ఉన్నట్టు చూపడం సమంజసం కాదన్నారు. ఏం సాధించారని, ఏం చేశారని సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ పై విమర్శలు చేశారంటూ మండిపడ్డారు. గవర్నర్ గా ఉంటారో లేక పార్టీ నేతగా వ్యవహరిస్తారో తేల్చుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చాలా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వమే ప్రశంస్తుంటే గవర్నర్ తమిళి సై మాత్రం తప్పు పట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా గవర్నర్ తన వైఖరి మార్చుకోవాలన్నారు. 

తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం రాజ్ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూడేళ్లలో మహిళా గవర్నర్‌ అయిన తనను వివక్షకు గురి చేశారని అన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ఇబ్బంది ఎదురైందని చెప్పారు.గవర్నర్‌ కార్యాలయానికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వడం లేదన్నారు.