షర్మిలకు మంత్రి సత్యవతి రాథోడ్​ హెచ్చరిక

షర్మిలకు మంత్రి సత్యవతి రాథోడ్​ హెచ్చరిక

మహబూబాబాద్, వెలుగు: రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్సార్​ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఒక శిఖండిలా వ్యవహరిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్​ విమర్శించారు. ‘‘పాదయాత్ర పేరుతో షర్మిల టీఆర్​ఎస్​ స్థానిక నాయత్వంపై, సీఎం కేసీఆర్​పై  విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నది. ఆడపిల్ల కదా అని వదిలేస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నది” అని దుయ్యబట్టారు. వైఎస్​ రాజశేఖరరెడ్డి అడ్డుపడకుంటే తెలంగాణ రాష్ట్రం ఏనాడో ఏర్పడేదని అన్నారు. ‘‘గతంలో మీ అన్న  జగన్ సమైక్యవాదిగా మహబూబాబాద్ పర్యటనకు వస్తున్న సమయంలో ఇక్కడి ప్రజలు రాళ్లతో తరిమికొట్టిన్రు. మానుకోట రాళ్లకు పని చెప్పే పరిస్థితి మళ్లీ తీసుకురావొద్దు’’ అని షర్మిలను ఆమె హెచ్చరించారు. ఆదివారం మహబూబాబాద్​ జిల్లా నూతన మండలం ఇనుగుర్తి ప్రారంభోత్సవ సమావేశంలో సత్యవతి రాథోడ్​  మాట్లాడారు. 

తెలంగాణతో నీకేం సంబంధం?: మాలోతు కవిత

తెలంగాణ  ప్రజలు ఎవ్వరూ రాజన్న రాజ్యం కోరుకోవడం లేదని ఎంపీ మాలోతు కవిత అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల మీద షర్మిల ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత విమర్శలు చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. ‘‘తెలంగాణ ప్రాంతంతో నీకు ఎలాంటి సంబంధం ఉంది. నీ తల్లి గారిది కడప, అత్తగారిది గురజాల అయినప్పుడు ఈ ప్రాంతంతో నీకేం సంబంధం?” అని నిలదీశారు. 

కేసీఆర్​కు ఎన్టీఆర్​ అంతటి పేరు: ఎర్రబెల్లి 

తెలంగాణ ప్రాంతంలో సీఎం కేసీఆర్ ను ఎవరు విమర్శించినా ఉరికిచ్చి కొట్టాలని కార్యకర్తలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ‘‘బీజేపీ నాయకులు ఈడీ,  సీబీఐ పేరుతో టీఆర్ఎస్  నాయకులను  వేధిం పులకు గురిచేయడం మానుకోవాలి. గతంలో ఏ సీఎం పని చేయని విధంగా సీఎం కేసీఆర్  ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రు. నా రాజకీయ జీవితంలో దివంగత సీఎం ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ అంతటి పేరు దక్కిం చుకున్నరు. రాజకీయంగా సీఎం కేసీఆర్​ను కాపాడుకోవాలి” అని ఆయన అన్నారు.