రాజన్న సిరిసిల్ల, వెలుగు: భక్తుల విశ్వాసాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, విస్తరణ పనులను చేయిస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్ భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మంత్రి ప్రత్యేక పూజలు చేసి కోడె మొక్కు చెల్లించారు. ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో భక్తుల రద్దీ ఉండే ఆలయాల అభివృద్ధి, విస్తరణ పనులకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రూ. 150 కోట్లతో విస్తరణ పనులకు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.
మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు వేగంగా పూర్తవుతున్నాయని తెలిపారు. మేడారం జాతరకు ముందు రాజన్న ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, అందులో భాగంగానే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అధికారులు ఉన్నారు.
