
- ఆదిలాబాద్, నాగర్ కర్నూలులో పర్యటించండి
- గవర్నర్ ను కోరిన మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు : రెండేండ్లుగా పెండింగ్ లో ఉన్న ములుగు పంచాయతీకి మున్సిపాలిటీ హోదా కల్పించే బిల్లుకు ఆమోదముద్ర వేయాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మంత్రి సీతక్క కోరారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ ఘర్షణ వివరాలను, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను, ఆదివాసీలు, మైనారిటీల మధ్య సఖ్యత కుదిర్చేలా ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్ కు వివరించారు.
మంగళవారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి గవర్నర్ ను మంత్రి సీతక్క కలిశారు. ఒకే బిల్లులో ములుగును మున్సిపాలిటీ చేయడం, జీహెచ్ఎంసీ చట్టసవరణ, మున్సిపల్ చట్ట సవరణ అంశాలు ఉన్నాయని గవర్నర్ కు సీతక్క తెలిపారు. జీహెచ్ఎంసీ కోఆప్షన్ సభ్యుల సంఖ్యను 5 నుంచి 9కి, అందులో మైనారిటీ కోఆప్షన్ సభ్యుల సంఖ్యను 2 నుంచి 5 పెంచుతూ గత ప్రభుత్వం బిల్ పాస్ చేసిందని ఆమె వివరించారు.
గ్రామాన్ని దత్తత తీసుకునే యోచనలో గవర్నర్
గవర్నర్ ను కలిసిన తరువాత మంత్రి సీతక్క రాజ్ భవన్ దగ్గర మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ చట్టసవరణ, మున్సిపల్ చట్ట సవరణ అంశాలు మిళితమై ఉండటంతో మాజీ గవర్నర్ తమిళిసై బిల్లును రాష్ట్రపతికి పంపారన్నారు. దీంతో ఇప్పటి వరకు ములుగు మున్సిపాలిటీ కాలేదు. జీహెచ్ఎంసీ చట్ట సవరణల బిల్లులోనే ములుగు మున్సిపాలిటి అంశాన్ని చేర్చారు.
ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి తెలిపారు. ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని గవర్నర్ ను కోరామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. జిష్ణు దేవ్ వర్మ ములుగులో గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నారని, దత్తత గ్రామాల లిస్ట్ ఆయనకు పంపామన్నారు.