పట్టభద్రుల ఆత్మబంధువు తీన్మార్‌‌ మల్లన్న

పట్టభద్రుల ఆత్మబంధువు తీన్మార్‌‌ మల్లన్న
  •     భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన మంత్రి సీతక్క 

హైదరాబాద్, వెలుగు : ప్రశ్నించే గొంతుక, పట్ట భద్రులకు ఆత్మ బంధువు తీన్మార్ మల్లన్న అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పట్టభద్రులు తమ అమూల్యమైన ఓటును మల్లన్నకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓటర్లను ఉద్దేశించి శనివారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. దొరల పాలన సాగించిన కేసీఆర్, పదేండ్ల బీఆర్ ఎస్ పాలనపై తీన్మార్ మల్లన్న తనదైన శైలిలో పోరాటం చేశారని పేర్కొన్నారు. ప్రజల పక్షాన కొట్లాడుతున్న మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రులు గెలిపించాలని కోరారు.

మలావత్‌‌ పూర్ణకు అభినందనలు

సికింద్రాబాద్, వెలుగు : అతి పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించిన తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు మలావత్‌‌ పూర్ణను  మంత్రి సీతక్క అభినందించారు. ఎవ‌‌రెస్టు ఎక్కి పదేండ్లు పూర్తయిన సందర్భంగా పూర్ణ కుటుంబ స‌‌భ్యుల‌‌తో కలిసి మంత్రి సీతక్కను కలిశారు. ఈ సంద‌‌ర్భంగా మంత్రి ఆమెను అభినందించి, స‌‌న్మానించారు. మలావత్ పూర్ణ తెలంగాణకే గర్వకారణమని చెప్పారు.