మేడారం పనులను ఇన్‌‌‌‌ టైంలో పూర్తి చేయాలి : మంత్రి సీతక్క

మేడారం పనులను ఇన్‌‌‌‌ టైంలో పూర్తి చేయాలి :  మంత్రి సీతక్క

తాడ్వాయి, వెలుగు : మేడారం మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌లో భాగంగా చేపట్టిన రాతి శిల్పాల నిర్మాణంతో పాటు ఇతర పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, పగిడిద్దెరాజు, గోవిందరాజుల గద్దెలను, సలారం మధ్యలో ఏర్పాటు చేస్తున్న రాతి పిల్లర్ల స్థాపన నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు.

 ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అంతకుముందు అమ్మవార్ల గద్దెల వద్ద  పసుపు, కుంకుమ, బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

 అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం పూజారులు మంత్రి, ఎమ్మెల్యేను సన్మానించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌‌‌‌ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం  సర్పంచ్ భారతి వెంకన్న పాల్గొన్నారు.