
ములుగు, వెలుగు: బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో ఆర్థిక, పాలన వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి సీతక్క విమర్శించారు. ములుగు జిల్లా ఇంచర్ల ఎంఆర్ గార్డెన్స్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. గత పదేండ్లలో బీఆర్‌ఎస్ లీడర్లు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువత కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయన్నారు.
బీసీలకు సామాజిక న్యాయం అందించాలన్న తపనతో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థలకు కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉండాలని, ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి పాల్గొన్నారు.