అంగన్వాడీ నియామకాల్లోరోస్టర్ పాయింట్ల ఖరారుకు కమిటీ : మంత్రి సీతక్క

అంగన్వాడీ నియామకాల్లోరోస్టర్ పాయింట్ల ఖరారుకు కమిటీ : మంత్రి సీతక్క
  • ఉత్తర్వులు జారీ చేసిన మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ

హైదరాబాద్, వెలుగు: ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో అంగన్​వాడీ సిబ్బంది నియామకాలకు సంబంధించిన రోస్టర్ పాయింట్ల ఖరారు కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్ జీకే సునందతో పాటు మరో ముగ్గురు అధికారులు కమిటీలో ఉంటారు. ఈ మేరకు స్ర్తీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీజన ఆదేశాలు జారీ చేశారు. ఏపీ, కర్నాటక, చత్తీస్​గఢ్ రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి మంత్రి సీతక్కకు రిపోర్ట్ ఇస్తుంది. 

నివేదిక ఆధారంగా రోస్టర్ పాయింట్లను ప్రభుత్వం ఖరారు చేయనున్నది. రాష్ట్రంలో 14 వేలకు పైగా అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. త్వరలో వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఏజెన్సీ ఏరియాలో ఆదివాసీలకే ఉద్యోగాలు కల్పించే జీవో నంబర్ 3ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. అయితే, అంగన్​వాడీ చిన్నారులకు అలనా.. పాలనా.. పూర్వ ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే (ట్రైబల్ ఏరియాల్లో వారి భాష) ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నది.