ఓట్ల కోసం చస్తా అనే నాలెడ్జ్​ నాకు లేదు.. ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డిపై​ సీతక్క ఫైర్

ఓట్ల కోసం చస్తా అనే  నాలెడ్జ్​ నాకు లేదు.. ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డిపై​ సీతక్క ఫైర్

హైదరాబాద్, వెలుగు: ఓట్ల కోసం చస్తా అనే నాలెడ్జ్​తనకు లేదని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి మాట్లాడుతూ.. ‘గత బీఆర్ఎస్​ప్రభుత్వంలో ట్రాన్స్​పోర్ట్​లో ఉన్న సుమారు పది లక్షల మంది డ్రైవర్లకు రూ.5లక్షల ఇన్సూరెన్స్ చేశామని.. ఈ అంశంపై మంత్రి సీతక్కకు నాలెడ్జ్​లేకపోవచ్చు’ అని పేర్కొన్నారు. దీంతో కౌశిక్​రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్​అయ్యారు. మహిళల పట్ల దురహంకారంగా మాట్లాడే నాలెడ్జ్ తనకు లేదని, ఓట్ల కోసం చస్తా అనే నాలెడ్జ్​తనకు లేదని కౌంటర్​ఇచ్చారు. అలాగే, ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టడం కాదని, మహిళలకు ఫ్రీ బస్సుపై వారి వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు. అలాగే, కౌశిక్​ రెడ్డి వ్యాఖ్యలపై విప్​ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. మహిళా మంత్రి అంటే అంత చులకన ఎందుకని ప్రశ్నించారు. ‘తాగింది, తూలింది కేసీఆర్​ పాలనలోనే.. బూడిద రాజకీయం, లిక్కర్​ రాజకీయం కరెక్ట్​ కాదు’ అని అన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడుతూ.. ‘మహిళా మంత్రిని నాలెడ్జ్​ లేదని మాట్లాడడం సరికాదు.. తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలి. సభా గౌరవం ఎలా కాపాడాలి.. సభలో ఏ విధంగా మాట్లాడాలనేది అనుభవం ఉన్న  కేటీఆర్, గోపీనాథ్, సబిత లాంటి వాళ్లు కొత్తగా వచ్చిన సభ్యులకు చెప్పాలి’ అని సూచించారు. 

ఇది అడియాశల బడ్జెట్: కౌశిక్​రెడ్డి

ఆటో డ్రైవర్లకు రూ.12వేలు ఇస్తమని మేనిఫెస్టో లో పెట్టి బడ్జెట్​లో నిధులు కేటాయించలేదని.. ఇది అడియాశల బడ్జెట్​అని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి విమర్శించారు. ఫ్రీ బస్సులు వచ్చినప్పటి నుంచి 59మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని అన్నారు. అలాగే, బస్సుల సంఖ్య పెంచాలన్నారు. ఫ్లై యాష్​ పై ఆరోపణలు చేస్తూ ఓవర్​ లోడ్​ వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయన్నారు. మధ్యప్రదేశ్​లో బ్లాక్​ లిస్ట్ లో పెట్టిన​బీర్ల కంపెనీకి ఇక్కడ పర్మిషన్ ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. తాగండి ఊగండి ఖజానా నింపండి అన్నట్టు సర్కారు తీరు ఉందన్నారు. దీంతో ప్రభుత్వ విప్​ అడ్లూరి లక్ష్మణ్​ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. గత బీఆర్ఎస్​ ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరిగిన ఇసుక దందాపై విచారణ జరిపించాలన్నారు. కౌశిక్​ రెడ్డి సీఎంను ఏకవచనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్​సింగ్​ రాజ్​ఠాకూర్​ మాట్లాడుతూ.. పవర్​ ప్లాంట్​ల నుంచి వచ్చే ఫ్లై యాష్ ను గత ప్రభుత్వ హయాంలో వేల లారీల్లో తీసుకెళ్లారని చెప్పారు. వందల కోట్ల స్కామ్​జరిగిందని, అది మాట్లాడితే బాగుండని అన్నారు. ఓవర్​లోడ్ పై​నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.