- పేదల పొట్ట కొట్టడమే కేంద్రం ఉద్దేశం: మంత్రి సీతక్క
- కేంద్రం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాకుండా, దాని ఆత్మ, అమలు విధానాన్ని మార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మంత్రి సీతక్క మండిపడ్డారు. గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించాలనే మహాత్మా గాంధీ ఆలోచనలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటున్నదని, ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నదని అన్నారు. ఈ మేరకు మంత్రి సీతక్క సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పేదలు, రాష్ట్రాలను శిక్షించేలా కేంద్రం విధానం ఉన్నదని అన్నారు.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్)’ (వీబీ–జీరామ్జీ)గా మార్చే బిల్లును మంత్రి సీతక్క తప్పుబట్టారు. గ్రామీణ పేదలకు జీవనోపాధి భద్రత కల్పించడం, వలసలను తగ్గించడం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిని సాధించడంలాంటి గొప్ప లక్ష్యాలతో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చారిత్రక పథకాన్ని నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతోనే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నదని మండిపడ్డారు.
గతంలో వందశాతం నిధులు వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమన్నారు. ఇది రాష్ట్రాల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయమని, కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నమేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి నిధులు కేటాయించాలని, బాధ్యతాయుతంగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
