మేం ఏం పని చేయకపోతే..‌‌‌‌‌‌‌‌ఊర్లలో విషజ్వరాలు వచ్చేవి కదా! : మంత్రి సీతక్క

మేం ఏం పని చేయకపోతే..‌‌‌‌‌‌‌‌ఊర్లలో విషజ్వరాలు వచ్చేవి కదా! : మంత్రి సీతక్క
  •     అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క కౌంటర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రప్రభుత్వం ఊర్లలో  ఏ పనులూ చేయకపోతే.. పారిశుధ్యమే లేకుంటే విష జ్వరాలు వచ్చి జనాలు చచ్చిపోతుండే కదా.. అసలు పారిశుధ్యం లేకుంటే ఊర్లు ఉంటాయా? అని మంత్రి సీతక్క అన్నారు.  గురువారం అసెంబ్లీలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. అడవి బిడ్డనైన తాను మంత్రిగా ఉండటం బీఆర్ఎస్ వాళ్లకు అస్సలు నచ్చడం లేదని, అందుకే మొదటి నుంచి తనపై పడి ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడంతోనే కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయని సీతక్క గుర్తు చేశారు. ఆ రూ.2 వేల కోట్ల నిధులు లాప్స్ అవుతాయనే ఉద్దేశంతోనే, రిజర్వేషన్ బిల్లు క్లియర్ కాకున్నా వెంటనే ఎన్నికలకు వెళ్లామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ నిధులు రిలీజ్ అవుతున్నాయని, ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు విడుదల చేశామని ఆమె వెల్లడించారు. తాము నిధులు ఇవ్వకపోతే గ్రామాల్లో ఇన్ని రోజులు విద్యుత్ దీపాలు ఎలా వెలుగుతున్నాయని సీతక్క ప్రశ్నించారు.

మిషన్ భగీరథపై అబద్ధాలొద్దు..

మిషన్ భగీరథపై సునీతా లక్ష్మారెడ్డి ఆరోపణలను మంత్రి సీతక్క తప్పుబట్టారు. ఓ బాలుడు నీళ్ల పైపుతో ఆడుకుంటుంటే.. కేసీఆర్ లేకపాయె, నీళ్లు రాకపాయె అంటూ అబద్ధాలు ప్రచారం చేయడం ఘోరమన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 98 శాతం మంది సర్పంచులతో రెగ్యులర్ గా రివ్యూ చేస్తున్నామని, ఎవరు ఎవరితో మాట్లాడారో డేటా మొత్తం సభ ముందు పెడతానని చెప్పారు. మీరు నియమించిన ఈఎన్సీనే ఇప్పటికీ కొనసాగిస్తున్నామని, పారదర్శకతకు అది నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే, కళ్యాణ లక్ష్మి ఎవరికి రాలేదో వివరాలు ఇస్తే ఆ ఎంఆర్ఓ, ఆర్డీఓలపై చర్యలు తీసుకుంటానని సీతక్క స్పష్టం చేశారు.  

తులం బంగారం పథకం ఇంకా మొదలు పెట్టలేదనీ.. దీనికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఆరు గ్యారంటీలు మొదలు కాలేదంటున్నారనీ.. అసెంబ్లీలోనే ఉచిత బస్సు ప్రారంభించామని గుర్తుచేశారు. దళితుడిని సీఎం చేస్తామని, మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ మోసం చేసిందని సీతక్క  పేర్కొన్నారు.