మహిళా సంఘాలకు రూ.27 వేల కోట్ల రుణాలు : మంత్రి సీతక్క

మహిళా సంఘాలకు రూ.27 వేల కోట్ల రుణాలు : మంత్రి సీతక్క
  • ఇందిరా మహిళా శక్తితోపేదరిక నిర్మూలన 
  • సరస్ మేళా ప్రారంభోత్సవంలోమంత్రి సీతక్క 

హైదరాబాద్, వెలుగు: బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు ఇప్పటివరకు రూ.27 వేల కోట్ల రుణాలు ఇచ్చామని మంత్రి సీతక్క అన్నారు. తీసుకున్న రుణాల నుంచి 98 శాతం రీపేమెంట్ చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌ హైటెక్ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్‌‌‌‌లో సరస్ మేళాను మంత్రి ప్రారంభించారు. మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌‌‌‌ను సందర్శించి, వారితో మాట్లాడి ఉత్పత్తులను కొనుగోలు చేశారు. సీతక్క మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తున్నామని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే పేదరికం అంతం అవుతుందన్నారు. హైటెక్ సిటీ వంటి విలువైన ప్రదేశాన్ని గ్రామీణ మహిళల చేతి వృత్తులు, ఉత్పత్తుల ప్రదర్శన కోసం కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

 నారాయణపేటలో మహిళా సమాఖ్య విజయవంతంగా పెట్రోల్ బంకును నడుపుతోందని, ఆరు నెలల్లో రూ.13.7 లక్షల ఆదాయం సమకూరిందని చెప్పారు. సోలార్ పవర్ ప్రాజెక్టులు, పలు వ్యాపారాలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనకు హైదరాబాద్‌‌‌‌లో మరికొన్ని ప్రదేశాలను కేటాయిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు లోన్లు సులభంగా అందజేస్తున్న పలువురు బ్యాంకర్లను సన్మానించారు. కాగా, ఈ నెల 29 వరకు సరస్ మేళా కొనసాగనుంది. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బాలల పరిరక్షణ కమిషన్ చైర్‌‌‌‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, మహిళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌‌‌‌పర్సన్ బండ్రు శోభ, వ్యవసాయ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, అదనపు సీఈవో కాత్యాయిని, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, వీహబ్ సీఈవో సీతా పల్లచోళ తదితరులు పాల్గొన్నారు.