హైదరాబాద్, వెలుగు: జనవరిలో జరిగే సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు రావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి సీతక్క ఆహ్వానం పలికారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరకు తెలంగాణ ప్రభుత్వం, ఆదివాసీ సమాజం తరఫున ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళామహోత్సవ్–2025 జరిగింది. ఈ వేడుకకు రాష్ట్రపతిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. భారతీయ కళా, వంటకాల, ప్రజా సంప్రదాయాల వైభవాన్ని ఆరు
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి అందిస్తున్న ఈ మహోత్సవం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే భారత ఆత్మను ప్రతిబింబిస్తుందని చెప్పారు. తెలంగాణ నేలపై జరుగుతున్న ఈ వేడుక.. దేశవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యాన్ని ఒకే వేదికపై తీసుకొస్తుందని తెలిపారు. హైదరాబాద్‌ను ‘మినీ ఇండియా’గా పిలుస్తారని, ఇక్కడి ‘గంగా -జమునా’ సంస్కృతి భారతీయ సమన్వయానికి ప్రతీక అని పేర్కొన్నారు.
తెలంగాణ సాంస్కృతిక సంపదలైన ఒగ్గుకథ, పేరిణి శివతాండవం, బోనాలు, బతుకమ్మ, సమ్మక్క- సారలమ్మ జాతర వంటి గొప్ప సంప్రదాయాలను మంత్రి ప్రస్తావించారు. కూచిపూడి, భారతనాట్యం వంటి శాస్త్రీయ కళలతో పాటు గిరిజన, ప్రజా కళలకు తెలంగా ణ ఇచ్చే గౌరవాన్ని వివరించారు.
టూరిజానికి నిధులు ఇవ్వండి..
ఆదివాసీ జనాభా అధికంగా ఉన్న ములుగు జిల్లాలో అభివృద్ధి పనులు, ఎకో ఫ్రెండ్లీ టూరిజం ప్రాజెక్టులకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. మల్లూరు దేవస్థానం అభివృద్ధికి రూ.30 కోట్లు, బొగత వాటర్ ఫాల్స్ అభివృద్ధికి రూ.50 కోట్లు, జంపన్న వాగు డెవలప్‌మెంట్‌కు రూ.50 కోట్లు కేటాయించాలని హైదరాబాద్‌లో కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు.
