- కుల, మతాలను అడ్డంపెట్టుకొని రాజకీయం చేసే పార్టీ అది: ఎంపీ వంశీకృష్ణ
- రిజర్వేషన్లకు అడ్డుపడుతూ ప్రజలను మోసం చేస్తున్నది
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదని వెల్లడి
జగిత్యాల / గోదావరిఖని /కోల్‌బెల్ట్ / దండేపల్లి, వెలుగు: బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కుల, మతాలను అడ్డంపెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. శుక్రవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వ కోడూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో విశాక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బెంచీల పంపిణీ కార్యక్రమానికి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐసీసీ చీఫ్మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నదని చెప్పారు.
బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడుతున్నదని, రిజర్వేషన్ల విషయంలో స్పష్టత ఇవ్వకుండా బీసీలను మోసం చేస్తున్నారని ఎంపీ వంశీకృష్ణ మండిపడ్డారు. కాగా, కష్టపడి చదివితే విద్యార్థుల భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని తన తాత కాకా వెంకటస్వామి చెప్పేవారని, ఆయన మాటలు ఎప్పుడూ తనకు గుర్తుంటాయని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. స్కూల్‌లో బెంచీలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలిసి విశాక ట్రస్ట్ ద్వారా బెంచీలు అందించామని చెప్పారు. గతంలోనూ ఇదే స్కూల్‌కు 50 బెంచీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
డ్రింకింగ్ వాటర్, టాయిలెట్లు, ప్రహరీలాంటి మౌలిక వసతుల కోసం కూడా ఎంపీ లాడ్స్ నుంచి ఫండ్స్ఇస్తానని హామీ ఇచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏ స్కూల్‌కు.. ఏ సమస్య వచ్చినా సహాయం చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని వంశీకృష్ణ పరిశీలించారు. పెగడపల్లి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు తాటిపర్తి కరుణాకర్‌రెడ్డిని పరామర్శించారు.
పత్తి కొనుగోళ్లపై ఆందోళన వద్దు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపెల్లి, హాజీపూర్, మంచిర్యాల మండలాల్లో ఆయన పర్యటించారు. దండేపల్లిలోని వెంకటేశ్వర కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని, మంచిర్యాలలో ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలోని అడ్వాన్స్డ్టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను పరిశీలించారు. హాజీపూర్ మండలం గుడిపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యార్థుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా సందర్భాల్లో ఎంపీ మాట్లాడుతూ.. ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలన్న సీసీఐ నిర్ణయంతో రైతులు ఆందోళన చెందొద్దని, ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని సీసీఐ చైర్మన్ లలిత్‌మోడీపై, కేంద్రంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్రావు ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పారు.
కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్కుకూడా లెటర్ రాసినట్లు చెప్పారు. దీంతో ఎంత పత్తి అయినా కొనుగోలు చేసేందుకు సీసీఐ ఏర్పాట్లు చేసిందన్నారు. అధిక దిగుబడి వచ్చిన రైతులు తమ వివరాలను అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని, దిగుబడి ఆధారంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఎక్స్‌పర్ట్ ఫాక్యల్టీతో విద్యా బోధన జరుగుతున్నదని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ఎంపీ లాడ్స్ ఫండ్స్ నుంచి విద్యార్థులకు బస్సు సర్వీసుతోపాటు స్పోర్ట్స్ కిట్స్ అందిస్తామన్నారు. ఇటీవల కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి జల సంరక్షణ పురస్కారాల్లో మంచిర్యాల జిల్లాను జాతీయస్థాయిలో నిలిపి అవార్డు అందుకున్న కలెక్టర్‌ను ప్రశంసించారు. ఏటీసీలతో వివిధ ట్రేడ్స్‌లో విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి.. స్వయం ఉపాధి పొందేలా అవకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు.
ఎన్ని అడ్డంకులొచ్చినా ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొస్తా..
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రామ గుండం ఏరియాలో పనిచేస్తున్న కార్మికుల కోసం ఈఎస్ఐ హాస్పిటల్‌ను తీసుకొస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. తాను వస్తున్నట్టు సమాచారం అందించినా అక్కడ లైటింగ్, టెంట్, వేదిక లాంటి కనీస ఏర్పాట్లు చేయని అధికారులపై మండిప డ్డారు. ఈఎస్ఐ హాస్పిటల్నిర్మించనున్న 3.30 ఎకరాల స్థలం చుట్టూ కాంపౌండ్‌వాల్ నిర్మించామని ఎంపీకి మేనేజర్ ఖగేశ్వరరావు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఏడేండ్లుగా ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు అంశాన్ని ఎవరూ పట్టించుకోలేదని, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి తాను కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీ యకు వినతిపత్రాలు అందజేసినట్టు తెలిపారు.
ఆస్పత్రిని మంజూరు చేయించి రూ.150 కోట్లతో టెండర్ దశకు తీసుకొచ్చామన్నారు. తాము ఎంత కృషి చేస్తున్నా ఏ ఒక్క అధికారి స్పందించడం లేదని మండిపడ్డారు. డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని అక్కడ ప్రస్తావించాలన్న ఉద్దేశంతో స్థల పరిశీలనకు వచ్చినట్టు చెప్పారు. రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, దాన్ని నెరవేర్చుకుంటా మని చెప్పారు. ఎంపీ వెంట అడిషనల్ కలెక్టర్, కమిషనర్ జె.అరుణ శ్రీ, ఆర్డీవో గంగయ్య, ఎమ్మార్వో శ్రీపాద ఈశ్వర్, లీడర్లు ఉన్నారు.
