హెచ్ఐఎల్టీపీ పేరిట 5 లక్షల కోట్ల భూ స్కామ్!

హెచ్ఐఎల్టీపీ పేరిట 5 లక్షల కోట్ల భూ స్కామ్!
  • పాలసీకి ముందే ఒప్పందాలు జరిగినయ్.. కేటీఆర్​ ఆరోపణలు
  • మార్కెట్ వ్యాల్యూలో30% ఫీజుకే రెగ్యులరైజ్ చేస్తున్నరు
  • మేం అధికారంలోకి వచ్చాక స్వాధీనం చేస్కుంటం
  • ఎవరినీ వదలం.. చర్యలు తీసుకుంటమని వ్యాఖ్య 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం తెస్తున్న హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్​ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్​టీపీ) వెనుక రూ. 5 లక్షల కోట్ల భూకుంభకోణం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఆరోపించారు. ‘‘ఈ వ్యవహారంలో రూ.50 వేల కోట్లను సీఎం రేవంత్ తన జేబులో వేసుకోవాలని చూస్తున్నరు. ఈ స్కామ్ దేశచరిత్రలోనే అతి పెద్ద ల్యాండ్ స్కామ్. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తులు, బంధువులు, రియల్ ఎస్టేట్ గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ పాలసీని తెచ్చారు. చాలా తక్కువ ధరకే వేలాది ఎకరాల భూములను మల్టీ యూజ్​లో భాగంగా రియల్​ఎస్టేట్​గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ భవన్​లో  శుక్రవారం మీడియాతో కేటీఆర్​ మాట్లాడారు.

 హెచ్ఐఎల్​టీపీ అనేది పాలసీ కాదని.. ఇండస్ట్రియల్ భూముల రెగ్యులరైజేషన్​ ముసుగులో చేస్తున్న భారీ స్కామ్ అని ఆరోపించారు. ‘‘బాలానగర్, జీడిమెట్ల, సనత్‌‌‌‌‌‌‌‌నగర్, అజామాబాద్ సహా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్‌‌‌‌‌‌‌‌లలో ఉన్న సుమారు 9,292 ఎకరాల భూములను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరాకు రూ.40  కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పలుకుతున్నది. అలాంటి విలువైన భూములను రేవంత్.. కేవలం గవర్నమెంట్ వ్యాల్యూలో 30శాతానికే అప్పగించాలని చూస్తున్నారు’’ అని  వ్యాఖ్యానించారు. 

తాము అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు, ఎస్ఆర్​వో రేట్ల కంటే 100 నుంచి 200 శాతం అధికంగా వసూలు చేయాలని ఒక చట్టం చేశామన్నారు. ‘‘కానీ.. కాంగ్రెస్​ ప్రభుత్వం మాత్రం కేవలం 30 శాతానికే రెగ్యులరైజ్ ఎందుకు చేస్తున్నది?  ఎవరికి లబ్ధి చేయాలని చూస్తున్నరు? దీంతో లక్షల కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్తాయి. ఇది అభివృద్ధి కాదని, పగటిపూట దోపిడీ” అని ఆరోపణలు గుప్పించారు.  

ప్రభుత్వ నిర్ణయాలు అనుమానాస్పదం 

హెచ్ఐఎల్​టీపీ పాలసీలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అనుమానాస్పదంగా ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘7 రోజుల్లోనే దరఖాస్తులను ఆహ్వానించి.. మరో ఏడు రోజుల్లోనే ఆమోదం ఎలా తెలుపుతారు? మొత్తంగా 45 రోజుల్లోనే భూముల రెగ్యులరైజేషన్​ ఎలా చేస్తారు? లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల అంశంపై ఎందుకింత తొందర? రేవంత్ రెడ్డి సోదరులు, అనుచరులు, మధ్యవర్తులు ఇప్పటికే ఈ భూముల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారు. పాలసీ ఆమోదానికి ముందే డీల్స్ కుదిరినయ్. హెచ్ఐఎల్​టీపీని కాంగ్రెస్​ ఏటీఎంగా మార్చుకుంటున్నది” అని దుయ్యబట్టారు. ఇందిరమ్మ ఇండ్లు, శ్మశాన వాటికలకు కూడా స్థలం లేని హైదరాబాద్​లో.. ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 

‘‘ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలి. లేదంటే ముంబై మాదిరి బహిరంగ వేలం వేయాలి. అలా చేయకుండా తక్కువ ధరకు భూములను పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తారా? హెచ్ఐఎల్​టీపీ కింద డీల్స్ కుదుర్చుకునే పారిశ్రామికవేత్తలు భవిష్యత్​లో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములను స్వాధీనం చేసుకుంటది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. స్కామ్​లో భాగమైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటది. ఎవ్వరినీ వదిలిపెట్టం.

 ప్రభుత్వం కూడా ఈ పాలసీని వెంటనే వాపస్​ తీసుకోవాలి. వాపస్ తీసుకోకుంటే కనీసం సగం భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని.. మరో సగాన్ని క్రమబద్ధీకరించాలి’’అని అన్నారు. ఈ అంశంపై బీజేపీ చర్చించాలని సవాల్ విసిరారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఈ పాలసీని వ్యతిరేకించాలని, లేదంటే కాంగ్రెస్​, బీజేపీ కలిసిపోయాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు.