- డిపాజిట్ అమౌంట్ తిరిగి రాదేమోనని ముందుకు రాని ఓనర్లు
- ఉమ్మడి పాలమూరు జిల్లాలో వడ్ల కొనుగోళ్లపై ప్రభావం
మహబూబ్‌నగర్, వెలుగు:కొనుగోలు సెంటర్ల నుంచి సేకరించిన వడ్లను రైస్ మిల్లులు కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)గా ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ, చాలా మిల్లులు సీఎంఆర్‌ను పెండింగ్ పెడుతున్నాయి. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లల్లో నష్టం వాటిల్లతోంది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సీఎంఆర్ కేటాయించాలంటే ఆయా మిల్లులు ముందుగానే కేటాయింపులకు అనుగుణంగా 10 శాతం బ్యాంక్ గ్యాంరంటీలు ఇవ్వాలని నిబంధన తీసుకొచ్చింది. ఆయా జిల్లాల్లో సాగైన వరి పంటకు అనుగుణంగా రెండు వారాల కింద ప్రభుత్వం కొనుగోలు సెంటర్లను ప్రారంభించింది. కానీ, బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వడానికి మిల్లుల యజమానులు ముందుకు రావడం లేదు. దీంతో వడ్ల కొనుగోళ్లపై ప్రభావం పడుతోంది.
ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి..
గతంలో ఎలాంటి డీఫాల్ట్ లేని మిల్లులకు తిరిగి కేటాయించే సీఎంఆర్‌కు సంబంధించి 10 శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డీఫాల్ట్ అయి ఫైన్ చెల్లించిన మిల్లులకు వారికి కేటాయించే సీఎంఆర్‌కు అనుగుణంగా 20 శాతం బ్యాంక్ గ్యారంటీ, డీఫాల్ట్ అయి ఫైన్ చెల్లించని మిల్లులకు సీఎంఆర్‌కు అనుగుణంగా 25 శాతం బ్యాంక్ ష్యూరిటీలు తీసుకోవాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. కానీ, బ్యాంక్ ష్యూరిటీలు ఇవ్వడానికి మిల్లుల యజమానులు ముందుకు రావడం లేదు. జోగులాంబ గద్వాల జిల్లాలో 63 రైస్ మిల్లులు ఉన్నాయి. వీటిలో గతంలో తీసుకున్న సీఎంఆర్‌ను తిరిగి ఇవ్వకపోవడంతో ఆఫీసర్లు 19 మిల్లులను బ్లాక్ లిస్టులో చేర్చారు.
వీరికి సీఎంఆర్ కేటాయింపులు చేయలేదు. మిగిలిన 44 మిల్లులకు సీంఎఆర్ కేటాయించాల్సి ఉండగా, 30 మిల్లులు ఇప్పటి వరకు బ్యాంక్ ష్యూరిటీలు ఇవ్వలేదు. కేవలం 14 మిల్లుల నుంచి మాత్రమే ష్యూరిటీలు వచ్చాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా రైస్ మిల్లులు వనపర్తి జిల్లాలో ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం ఈ జిల్లాలో 173 రైస్ మిల్లులున్నాయి. ఇందులో గత సీజన్లలో కేటాయించిన సీంఎఆర్ను తిరిగి ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో 39 మిల్లులను బ్లాక్ చేయగా, 134 మిల్లులు మిగిలాయి.
వీటిలో 81 మిల్లులకు మాత్రమే సీఎంఆర్ కేటాయింపుల అర్హత ఉంది. ఇందులో 49 మంది మిల్లర్లు మాత్రమే ఇప్పటి వరకు బ్యాంక్ ష్యూరిటీలు అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 93 మిల్లులున్నాయి. వీటిలో 12 లీజు మిల్లులు ఉన్నాయి. వీటికి సీఎంఆర్ అర్హత లేదని ఆఫీసర్లు తేల్చారు. మిగిలిన 81 మిల్లుల్లో రెండు మిల్లులను డీఫాల్ట్ లిస్ట్‌లో చేర్చారు. దీంతో 79 మిల్లులకు సీఎంఆర్ కేటాయింపులు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 56 మంది మాత్రమే 10 శాతం బ్యాంక్ ష్యూరిటీలు ఇచ్చారు. నారాయణపేట జిల్లాలో 72 రైస్ మిల్లులు ఉన్నాయి.
వీటిలో 31 రైస్ మిల్లులకు సీఎంఆర్ అలాట్ చేయడానికి ఆఫీసర్లు బ్యాంక్ ష్యూరిటీలు ఇవ్వాలని సూచించారు. ఒక్కో మిల్లుకు రెండు వేల మెట్రిక్ టన్నుల చొప్పున సీఎంఆర్ కేటాయించగా, ఒక్కో మిల్లు నుంచి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల చొప్పున బ్యాంక్ ష్యూరిటీలు తీసుకొని సీఎంఆర్ అలాట్ చేశారు. అయితే గతంలో 22 మిల్లులు డీఫాల్ట్ లిస్ట్‌లో ఉండగా, వంద శాతం సీఎంఆర్ క్లియర్ చేశారు. కానీ, ఈ మిల్లులపై రూ.4 కోట్లకు పైగా జరిమానా విధించగా, వాటిని ఇంకా క్లియర్ చేయలేదు. దీంతో ఈ మిల్లులకు సీఎంఆర్ అలాట్ చేయలేదు. మరో 11 మిల్లులపై కేసులు నమోదు చేశారు.
రొటేషన్ పద్ధతిలో సీఎంఆర్..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆయా మిల్లులకు అలాట్ చేసిన వడ్లను సీజన్ ముగిసేలోపు మర ఆడించి బియ్యంగా చేసి ప్రభుత్వానికి అప్పజెప్పాలి. కానీ, ఏ మిల్లులోనూ ఇలా జరగడం లేదని అంటున్నారు. రొటేషన్ పద్ధతిలో మిల్లర్లు ప్రభుత్వానికి సీఎంఆర్ అప్పగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వానాకాలం సీజన్లో అలాట్ చేసిన వడ్లను యాసంగి వడ్ల సీజన్ ప్రారంభమయ్యే లోపు సీఎంఆర్‌గా మార్చి ప్రభుత్వానికి ఇవ్వాలి. అలా కాకుండా మిల్లర్లు ఆ సీజన్‌కు అలాట్ చేసిన వడ్లను బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత సీజన్లో వచ్చే వడ్లను మర ఆడించి ఆ బియ్యాన్ని గత సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌గా చూపిస్తున్నట్లు తెలిసింది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం సీఎంఆర్ ఇవ్వడానికి నిర్దేశించిన డెడ్‌లైన్‌ను తరచూ పొడిగిస్తుండడం మిల్లర్లకు కలిసివస్తోంది.
దీంతో మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వడంలో పెద్ద మొత్తంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. సంబంధిత శాఖ ఆఫీసర్లు ఇచ్చిన లెక్కల ప్రకారం వనపర్తి జిల్లాలో గత సీజన్లో 88,287 మెట్రిక్ టన్నులను మిల్లులకు అలాట్ చేయగా, ఇప్పటి వరకు 7,612 మెట్రిక్ టన్నులు మాత్రమే సీఎంఆర్‌గా తిరిగి ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల్లో 38 వేల మెట్రిక్ టన్నులు తిరిగి ఇచ్చారు. నారాయణపేట జిల్లాలో 1.86 లక్షల మెట్రిక్ టన్నుల్లో 58 శాతం సీంఎఆర్ పూర్తి చేశారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో 40 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ పెండింగ్‌లో ఉంది.
