
బషీర్ బాగ్, వెలుగు : సావిత్రి బాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహించేందుకు కేబినెట్‌లో చర్చించి, అమలు పర్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర బీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మణి మంజరి అధ్యక్షతన సావిత్రి బాయి పూలే 193వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్‌తో కలసి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంఘ సేవకురాలు సావిత్రి బాయి పూలే అని కొనియాడారు. మహిళలు చదుకునేందుకు తొలి అడుగు సావిత్రి బాయి పూలే వేశారని, తనలాంటి ఎంతో మందికి ఆమె స్ఫూర్తి, ఆదర్శమని పేర్కొన్నారు. విప్లవ ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత.. చదువు ఆత్మవిశ్వాసం ఇస్తుందని సావిత్రి బాయి ఇచ్చిన స్ఫూర్తితో ఉన్నత చదువులు చదివి, ఈ స్థాయిలో ఉన్నానన్నారు. కుల వివక్ష అణచివేత నుంచి వచ్చిన వెలుగు రేఖ సావిత్రి బాయి అని పేర్కొన్నారు.
రాజకీయాలు అంటే సేవ..
నేటి సమాజంలో ఇంకా కుల వివక్ష ఉండటం బాధాకరమని మంత్రి సీతక్క అన్నారు. దానిని నిర్మూలించాలంటే ఆ మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తాను నిత్య విద్యార్థినని, రాజకీయం అంటే తన దృష్టిలో సేవ మాత్రమే అని, అందులో ఉన్న తృప్తి.. అజమాయిషీ చేయడంలో ఉండదని పేర్కొన్నారు. మంత్రి సీతక్క మరో అభినవ సావిత్రి బాయి పూలే అని జాజుల అన్నారు.
మహిళల పట్ల వివక్ష తొలగిపోవాలని, భూస్వాములు, పెత్తందారులపై పోరాటం చేసేందుకు ఆమె ఆయుధం పట్టారని గుర్తు చేశారు. జనవరి 3న జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని జాజుల మంత్రికి విజ్ఞప్తి చేశారు.