కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలి..ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క

కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలి..ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క

కొత్తగూడ, వెలుగు : కాంగ్రెస్ మద్దతుదారులను మీరు గెలిపించండి.. గ్రామాల అభివృద్ధి నేను చేస్తాను అని మంత్రి సీతక్క ప్రజలకు హామీ ఇచ్చారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శనివారం మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలంలోని 13 గ్రామాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాలకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని తెలిపారు. 

రెండేండ్ల నుంచి సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడంతో దాదాపు రూ.3 వేల కోట్లు నిధులు ఆగిపోయాయని చెప్పారు. ఎన్నికల అనంతరం ఆ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కొత్తగూడ, గంగారం మండలాలకు రెండు పంటలకు నీళ్లు ఇచ్చేందుకు రూ.150 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. 

అనంతరం మండలంలో ఏకగ్రీవమైన ఆరుగురు సర్పంచ్​లను మంత్రి సన్మానించారు. అంతకుముందు గుంజేడులోని ముసలమ్మ గుడిలో ముసలమ్మ తల్లిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గుంజేడు, కొత్తగూడ, కొత్తపల్లి, పొగుళ్లపల్లి, ఓటాయి, రాంపూర్, ఎదుళ్లపల్లి, గోవిందాపూర్, పెగడపల్లి, దుర్గారం, రామన్నగూడెం, ముస్మీ, వేలుబెల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, బ్లాక్ కాంగ్రెస్​ అధ్యక్షుడు మొగిలి, డీసీసీ సెక్రటరీ రూప్​సింగ్, డీసీసీ మెంబర్​ లావణ్య వెంకన్న, బిట్ల శ్రీనివాస్, కర్ర జనార్దన్​రెడ్డి, సర్పంచ్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.