ములుగు జిల్లాలో ఎకో ఎత్నిక్‌‌‌‌ విలేజ్‌‌‌: మంత్రి సీతక్క

ములుగు జిల్లాలో ఎకో ఎత్నిక్‌‌‌‌ విలేజ్‌‌‌: మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : ములుగు జిల్లాను టూరిజం హబ్‌‌‌‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇంచర్ల గ్రామ సమీపంలో ఎకో ఎత్నిక్‌‌‌‌ విలేజ్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. రామప్ప, లక్నవరంను అభివృద్ధి చేస్తూ.. ములుగు జిల్లాని రాష్ట్రంలో ఫస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సోమవారం పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌‌‌‌ పటేల్​ రమేశ్‌‌‌‌రెడ్డి, ములుగు అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ సీహెచ్. మహేందర్‌‌‌‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ రవిచందర్‌‌‌‌తో కలిసి ఇంచర్ల వద్ద ఎకో ఎత్నిక్‌‌‌‌ విలేజ్, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టూరిస్ట్‌‌‌‌లను ఆకర్షించడం కోసం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్‌‌‌‌ పెట్టినట్లు చెప్పారు. రామప్ప, లక్నవరం, మేడారం, బొగత జలపాతం, బ్లాక్ బెర్రీ, మల్లూరుతో పాటు అటవీ ప్రాంతాల్లో ఇప్పటికే పలు పనులు చేపట్టామని, మిగతా వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.

 రామప్పలో రూ.13 కోట్లతో ఐల్యాండ్‌‌‌‌ అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. మేడారంలో శాశ్వత పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.150 కోట్లను కేటాయించిందని, వీటికి సంబంధించిన పనులను త్వరలోనే చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం ములుగు జిల్లా జగన్నపేటలో డే కేర్ కేంద్రాన్ని ప్రారంభించి, అంగన్‌‌‌‌వాడీ బిల్డింగ్‌‌‌‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పల్నా పథకం కింద ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం, వెంకటాపురం ఐసీడీఎస్​ప్రాజెక్ట్‌‌‌‌ల పరిధిలో 25 డే-కేర్, క్రెచ్‌‌‌‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏడు నెలల నుంచి మూడేండ్ల వయస్సు గల పిల్లలకు క్రెచ్‌‌‌‌ సౌకర్యాలు అందించనున్నట్లు చెప్పారు. తర్వాత ములుగులోని సంక్షేమ భవన్‌‌‌‌లో సర్వాయి పాపన్న గౌడ్‌‌‌‌ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.