
- నాయక్ పోడుల కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తా
- మంత్రి సీతక్క హామీ
లోకేశ్వరం/ముథోల్, వెలుగు : పోడు భూముల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి సీతక్క చెప్పారు. ఆదివాసీలలో అట్టడుగు వర్గాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. నిర్మల్‌జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కుమ్రం భీం విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక లక్ష్మీ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసుల హక్కుల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కుమ్రం భీం అని కొనియాడారు. తెలంగాణ మహనీయుల జయంతోత్సవాలను గత ప్రభుత్వంలో అధికారికంగా జరపలేదని, కాంగ్రెస్ వచ్చాకే వీటిని అధికారికంగా జరుపుతోందని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన చట్టాలు, హక్కులపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. పండ్ల తోటల కోసం హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ ద్వారా ప్రత్యేక నిధుల మంజూరు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
కాగా అర్లీ ఎక్స్ రోడ్ నుంచి లోకేశ్వరానికి వచ్చే ప్రధాన రహదారిలో ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని, కొత్త బ్రిడ్జి మంజూరు చేయించాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మంత్రిని కోరారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు భోస్లే నారాయణరావు, పటేల్ విఠల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సోయం బాపూరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్‌బాబు, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్‌రావు, కాంగ్రెస్ ఎస్టీ సెల్ ముథోల్ అధ్యక్షుడు సంగెం నర్సయ్య, మండల అధ్యక్షుడు అట్టొలి రాజేశ్వర్, సురపు భూమేశ్ పాల్గొన్నారు. అనంతరం ముథోల్ మండలం బ్రాహ్మణగావ్‌లో గ్రామపంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు. ప్రజాప్రతినిధుల రాజకీయాలు పక్కన పెట్టి ఐక్యతతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. మండలంలోని బ్రాహ్మణగావ్ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.