
- పేదరికం తగ్గించేందుకు కృషి చేస్తున్నం: సీతక్క
- చేయూత పింఛన్లపై అధికారులతో మంత్రి రివ్యూ
హైదరాబాద్, వెలుగు: పెన్షన్ లు అందించడం సామాజిక బాధ్యత అని మంత్రి సీతక్క అన్నారు. చేయూత పెన్షన్ల పంపిణీపై ప్రజాభవన్ లో అధికారులతో గురువారం సీతక్క రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పింఛన్ల పంపిణీలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. పేదరిక నిర్మూలన కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు ఇందిరా మహిళా క్యాంటీన్లు, ప్రమాద బీమా ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటున్నదని తెలిపారు. 15 ఏండ్ల నుంచే మహిళా సంఘాల్లో సభ్యులుగా అవకాశం ఇస్తున్నామని, మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం బాగుపడుతుందని చెప్పారు.
ఆర్టీసీలో 200 కోట్ల జీరో టికెట్లు నమోదయ్యాయని తెలిపారు. మహిళలు.. ఫ్రీ బస్సు ఎక్కడమే కాకుండా.. వారిని బస్సు ఓనర్లను చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. పేదరికం తగ్గకపోతే సమాజంలో అంతరాలు పెరుగుతాయన్నారు. అర్హులకు పింఛన్ అందేలా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేదవారికి అన్యాయం చేసినట్లు అవుతుందన్నారు. సాంకేతిక కారణాలతో పింఛన్ ఇవ్వడం లేట్ అయితే ముందే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫేస్ రికగ్నిషన్ ద్వారా అర్హులకే పింఛన్ అందిస్తామని తెలిపారు. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షనే చేయూత... అదే వారి ధైర్యం అని పేర్కొన్నారు. ఇప్పపువ్వు లడ్డూ.. క్రెడిట్ అంతా ఐఏఎస్ దివ్యకే దక్కుతుందని, అలాగే.. ప్రతీ అధికారి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. సమావేశంలో సెర్ప్ సీఈవో దివ్య, దేవరాజన్, డైరెక్టర్ గోపి అధికారులు పాల్గొన్నారు.