ఆరు గ్యారంటీల..అమలుకే ప్రజాపాలన : సీతక్క

ఆరు గ్యారంటీల..అమలుకే ప్రజాపాలన : సీతక్క
  •     కాంగ్రెస్​ ప్రభుత్వంఆడంబరాలకు పోదు
  •     ఆదివాసీ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా
  •     పోడు రైతులపై ఉన్న కేసులు ఎత్తేస్తాం
  •     అధికారులు.. ప్రజాప్రతినిధులం జోడెద్దులుగా పనిచేస్తాం
  •     ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా రివ్యూ మీటింగ్​లో మంత్రి సీతక్క

ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్ర అభివృద్ధి కోసం అధికారులు.. ప్రజాప్రతినిధులం జోడెద్దులుగా పనిచేస్తామని మంత్రి సీతక్క చెప్పారు. ఆరు గ్యారంటీల అమలు కోసమే ‘ప్రజాపాలన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు చివరి గుడిసె వరకు అందేలా చూస్తామన్నారు. ‘ప్రజాపాలన’ నిర్వహణపై బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఆదిలాబాద్ కలెక్టరేట్ లో మంత్రి సీతక్క రివ్వ్యూ నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

ప్రతిఒక్కరికీ అర్థమయ్యేలా, ఈజీగా దరఖాస్తు చేసుకునేలా ఈ ప్రక్రియ ఉంటుందన్నారు. ఆరు గ్యారంటీలకు ఒకటే అప్లికేషన్​ఉంటుందని చెప్పారు. అర్హులైనవారు ఏ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారనే వివరాలు నమోదు చేస్తే సరిపోతుందన్నారు. జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, అంగన్​వాడీలు, ఏఎన్ఎంలు భాగస్వాములు కావాలని సూచించారు.

అప్లికేషన్లు నింపేందుకు గ్రామాల్లోని యువత సహాయం చేయాలని కోరారు. వంద‌రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలుచేసి తీరుతామన్నారు. జనవరి 6 తర్వాత కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని, మండల ఆఫీసుల్లో ప్రజాపాలన అప్లికేషన్లు అందజేయొచ్చని స్పష్టం చేశారు. 

పేదలకు ఇండ్లు ఇస్తాం

తెలంగాణ ఉద్యమ కారులపై ఎలాగైతే కేసులు ఎత్తివేస్తున్నామో.. పోడు రైతులపై ఉన్న కేసులను కూడా ఎత్తివేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.  వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. ఏజెన్సీలో అంగన్​వాడీ కేంద్రాలు, స్కూళ్లు లేవని, రోడ్లు, తాగునీరు, వైద్య అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గూడెం, గుడిసెకు సంక్షేమం అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం కాళేశ్వరం, పెద్ద పెద్ద భవనాలు నిర్మించడమే టార్గెట్​గా పెట్టుకుని పేదలను పట్టించుకోలేదని.

తాము ఆడంబరాలకు పోకుండా పేదలకు ఇండ్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలను కలుపుకుపోతామని చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన హేమన్ డ్రార్ఫ్​ వర్ధంతి వేడుకలను జనవరి 11న అధికారికంగా ఐటీడీఏలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలకు సంబంధిత వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మహారాష్ట్ర నుంచి వలసలను నియంత్రించడం, ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో లాండ్ ఆర్డర్​ అదుపు తప్పిందని, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​ కోరారు. సమావేశంలో మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోశ్, ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ ఖుష్బు గుప్తా, ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, నిర్మల్ అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్లు జనార్థన్ రాథోడ్, కోనేరు కృష్ణ, నిర్మల్ జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, బెల్లంపల్లి, ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్

వెడ్మ బొజ్జు పటేల్, కోవలక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఆదిలాబాద్, నిర్మల్ ఎస్పీలు ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, మంచిర్యాల డీసీపీ కేకన్ సుధీర్ రాంనాథ్ పాల్గొన్నారు. అనంతరం జడ్పీ ఆఫీసులో మంత్రి సీతక్కను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, స‌ర్పంచుల సంఘం అధ్యక్షుడు భూమ‌న్న యాద‌వ్‌, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

అమరవీరులకు నివాళులు

గుడిహత్నూర్ :  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రివ్యూ మీటింగ్‌కు వెళ్తూ ఇంద్రవెళ్లి మండల కేంద్రంలోని అమవీరుల స్థూపం వద్ద మంత్రి సీతక్క నివాళులర్పించారు. మంత్రి సీతక్కకు ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఐటీడీఏ పీఓ చాహత్‌బాజ్‌పాయ్‌ స్వాగతం పలికారు. అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేస్తున్న అమరవీరుల స్మృతి వనం గురించి ఐటీడీఏ పీఓ వివరించారు.