
ములుగు/ ఏటూరునాగారం, వెలుగు : ప్రజా ప్రభుత్వ పాలనలో అందరికీ పథకాలు చేరువ అయ్యేందుకు కృషి చేస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ములుగు క్యాంపు ఆఫీస్‌లో 48మంది లబ్ధిదారులకు రూ.63 లక్షల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్చెక్కులను మంత్రి అందజేశారు. అనంతరం ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి తుమ్మ కోమల–సాయిరెడ్డి దంపతులు, వారి మనుమడు తుమ్మ జయసింహారెడ్డి జ్ఞాపకార్థం ఉచిత మెగా స్పెషాలిటీ హెల్త్ క్యాంప్‌ను వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయగా, మంత్రి సీతక్క ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో పేదలకు సేవ చేయాలని తల్లిదండ్రులు, కొడుకు జ్ఞాపకార్థం తుమ్మ ప్రభాకర్‌రెడ్డి, తుమ్మ శ్రీధర్‌రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌లో మంత్రి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్పంపిణీ చేశారు.