వాల్టాను పక్కాగా అమలు చేయాలి..దీని కోసం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తాం: మంత్రి సీతక్క 

వాల్టాను పక్కాగా అమలు చేయాలి..దీని కోసం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తాం: మంత్రి సీతక్క 
  • పదేండ్లుగా వాల్టా అథారిటీ సమావేశాలు నిర్వహించకపోవడం అన్యాయమని మండిపాటు

హైదరాబాద్, వెలుగు: పర్యావరణ హితం, ప్రజల అభివృద్ధి కోసం వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం సెక్రటేరియెట్‌‌లో వాల్టా రాష్ట్రస్థాయి అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాల్టా అథారిటీలను నియమించాలన్నారు. సహజ వనరులను దుర్వినియోగం చేయకుండా అవసరం మేరకే వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

నీటిని అధికంగా వినియోగించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గత పదేండ్లలో వాల్టా అథారిటీ సమావేశాలు నిర్వహించకపోవడం అన్యాయమన్నారు. ప్రణాళిక ప్రకారం పర్యావరణాన్ని కాపాడుకునేందుకు గత ప్రభుత్వం కృషి చేయలేదని మండిపడ్డారు. వాల్టా చట్టంపై వారం రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కోరారు. నీటిని అధికంగా వినియోగిస్తున్నారని ఆంక్షలు పెడితే ఉపయోగం లేదని, కొత్తగా బోర్లు వేయొద్దని అధికారులు ఆంక్షలు పెట్టినా ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదని, అందుకే నీటి కొరత తలెత్తితే జరిగే ప్రమాదంపై వివరించాలని సూచించారు.

వాల్టా నిధిని ఏర్పాటు చేస్తాం .. 

నీటిని అవసరం ఉన్నంత మేరకు వినియోగించేలా కళాకారులతో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థానిక అధికారులతో కమిటీలు వేసి సమావేశాలు పెట్టాలని, మూడు నెలలకోసారి వాల్టా అథారిటీలు సమావేశమయ్యేలా చూడాలన్నారు. భూగర్భ జలాలు తగ్గిపోతున్న గ్రామాల్లో ఏ స్థాయిలో జలాలున్నాయో జనాలకు తెలిసేలా చేయాలన్నారు.

 ప్రత్యేకంగా వాల్టా నిధిని ఏర్పాటు చేస్తామని, పర్యావరణ హితం కోసం ఈ నిధిని ఖర్చు చేస్తామన్నారు. పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, వాల్టా రాష్ట్రస్థాయి అథారిటీ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. వాల్టా యాక్ట్‌‌ అమలును హైడ్రాకు వర్తింపజేయాలని నిర్ణయించారు. 

మినీ అంగ‌‌న్వాడీలకు అన్యాయం చేసింది హరీశ్‌‌ రావే.. 

పదోన్నతులు కల్పించకుండా మినీ అంగన్వాడీ టీచర్లకు అన్యాయం చేసిందే మాజీ మంత్రి హరీశ్ రావు అని మంత్రి సీతక్క ఆరోపించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మినీ అంగన్వాడీల సమస్యలను హరీశ్ పట్టించుకోలేదని.. ఇప్పుడు అధికారం పోగానే ఆయనకు ఈ సమస్య గుర్తుకొచ్చాయా? అని ప్రశ్నించారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీ టీచర్లుగా గుర్తించి, పూర్తి వేతనం చెల్లించాలని సీఎంకు హరీశ్‌‌ బహిరంగ లేఖ రాయడంపై సీతక్క మండిపడ్డారు.

‘‘పదోన్నతులపై ఎన్నికల ముందు ఓట్ల కోసం ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా మొక్కుబడి జీవోలిచ్చి,  తర్వాత చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆర్థిక శాఖ అనుమతులతో 3,438 మంది మినీ అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించాం’’ అని సీతక్క స్పష్టం చేశారు.