
- కొందరు పనిగట్టుకొని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నరు : మంత్రి సీతక్క
- మేడారంలో పెరిగిన భక్తులు
- నేడు మేడారం రానున్న మంత్రి పొంగులేటి
తాడ్వాయి, వెలుగు : ‘బీసీలకు సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది, బీఆర్‌ఎస్, బీజేపీలు బీసీ వ్యతిరేకుల మారి ప్రజలను మోసం చేస్తున్నారు, కొందరు వ్యక్తులు పనిగట్టుకొని సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారు’ అని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం మేడారంలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ పనుల మ్యాప్‌ను పరిశీలించి, సంబంధిత కాంట్రాక్టర్, ఆఫీసర్లతో మాట్లాడారు. పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కష్టకాలంలో తనతో నడిచిన ప్రతికార్యకర్తలు రుణపడి ఉంటానన్నారు.
నాయకులు, కార్యకర్తల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో ఉంటూ.. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. 15వ తేదీ నుంచి జెండా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, తాడ్వాయి మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అరెం లచ్చు పటేల్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ పాల్గొన్నారు.
వనదేవతల దర్శనానికి తరలివచ్చిన భక్తులు
మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసిన అనంతరం ఎత్తు బంగారంతో అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకొని కానుకలు, మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం యాటలు, కోళ్లను అమ్మవార్లకు బలిచ్చి కుటుంబ సభ్యులతో వనభోజనాలు చేశారు.
ఇయ్యాల మేడారానికి మంత్రి పొంగులేటి
ములుగు, వెలుగు : మేడారం ఆలయాన్ని సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సందర్శించనున్నారు. హైదరాబార్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా ఉదయం 10.30 గంటలకు మేడారం చేరుకోనున్న మంత్రి ముందుగా అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం మాస్టర్‌ప్లాన్ అమలులో భాగంగా చేస్తున్న పనులను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, మేడారం పూజారులతో కలిసి పర్యవేక్షించనున్నారు. మధ్యాహ్నం మేడారంలోని హరిత హోటల్‌లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించనున్నారు. సోమవారం మంత్రుల పర్యటన నేపథ్యంలో ములుగు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు.