రైతును రాజు చేయటమే ప్రభుత్వ లక్ష్యం : సీతక్క

రైతును రాజు చేయటమే ప్రభుత్వ లక్ష్యం : సీతక్క
  •     త్వరలో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తం
  •     బోథ్ ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సీతక్క
  •     ఇచ్చోడలో గృహ జ్యోతిని ప్రారంభించిన మంత్రి 

బోథ్/ ఇచ్చోడ/ నేరడిగొండ, వెలుగు : రాష్ట్రంలోని రైతులని రాజులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్​జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బోథ్ లో వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్​తో కలిసి నూతన పాలకవర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలో రైతు కమిషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తిస్తామన్నారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే కేబినెట్ మీటింగ్ బోథ్ రెవెన్యూ డివిజన్, సొనాల మండలంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు కోసం చర్చిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని, కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను అమలు చేస్తూ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ ఇన్​చార్జి ఆడే గజేందర్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశ్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, ఏఎంసీ చైర్మన్ గంగారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. 

ఆరు పథకాలను అమలు చేస్తాం

ఇచ్చోడ మండల కేంద్రంలో మంత్రి సీతక్క గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిమ్మల రాజుబాయి ఇంటికి జీరో బిల్లు రసీదును అందజేశారు. ఆరు గ్యారంటీలతో పాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి  సీతక్క ను స్థానిక ఎస్సీ కాలనీ దళిత మహిళలు కలిసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

2006లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చోడ శివారులోని భీమన్న గుట్టపై కేటాయించిన ప్లాట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కొని పార్కులకు వినియోగించుకుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తిరిగి ప్లాట్లు ఇప్పించాలని మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. అంతకుముందు నేరడిగొండ మండలం కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ప్రధాని సభ ఏర్పాట్ల పరిశీలన

ఆదిలాబాద్​లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానికి ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు ప్రభుత్వం త‌ర‌పున అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. స్వాగ‌తం ప‌లికేందుకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కేంద్ర మంత్రులు హాజరవుతారని తెలిపారు. మంత్రి వెంట కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్ ఆలం, మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌ పాల్గొన్నారు.