మార్నింగ్ వాక్ వద్దు..ఊర్లలో పర్యటించండి

మార్నింగ్ వాక్ వద్దు..ఊర్లలో పర్యటించండి
  •     అధికారులకు మంత్రి సీతక్క సూచన
  •     పారిశుధ్యంపై సమీక్ష 

ఆదిలాబాద్, వెలుగు : అధికారులు మార్నింగ్ వాక్ వెళ్లకుండా ప్రతిరోజూ ఉదయం ఊర్లలో పర్యటించి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క సూచించారు. సోమవారం మహారాష్ట్ర పర్యటన అనంతరం సాయంత్రం ఆదిలాబాద్​ జిల్లాకు చేరుకున్న సీతక్క అధికారులతో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నేపథ్యంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వరదలు, విష జ్వరాలు, హాస్టళ్లు, స్కూళ్లలో సమస్యలు, మిషన్ భగీరథ, వైద్యం, అంగన్వాడీ కేంద్రాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని సూచించారు.  మహిళ శిశు సంక్షేమ ద్వారా సరఫరా అవుతున్న పౌష్టికాహారం,  గుడ్లు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించి, నాణ్యమైన ఆహారం అందించాలన్నారు.

 కుళ్లిపోయిన గుడ్లు తీసుకోకుండా, నాణ్యమైనవి తీసుకునేలా సూపర్​వైజర్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హాస్టళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచడం, పాములు, క్రిమికీటకాలు వెళ్లకుండా శుభ్రం చేయించాల న్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు.  

మహారాష్ట్రలో గాంధీ ఆశ్రమం సందర్శన

ఆదిలాబాద్​ టౌన్ : మహారాష్ట్రలోని వార్దా జిల్లా కేంద్రానికి సమీపంలోని సేవాగ్రామ్​లో మహాత్మా గాంధీ స్థాపించిన ఆశ్రమాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను పరిశీలించారు. మంత్రి వెంట ఆదిలాబాద్ ​నియోజకవర్గ ఇన్​చార్జ్​ కంది శ్రీనివాసరెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.