పెండింగ్ నిధులు రిలీజ్ చేయండి : మంత్రి సీతక్క

పెండింగ్ నిధులు రిలీజ్ చేయండి : మంత్రి సీతక్క
  • కేంద్ర మంత్రులు అన్నపూర్ణా దేవి, గ‌‌‌‌జేంద్ర సింగ్ షేకావ‌‌‌‌త్‌‌‌‌కు మంత్రి సీతక్క విజ్ఞప్తి

న్యూ ఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగా ణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌‌‌‌ నిధులను వెంటనే విడుదల చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం మహిళా, శిశు సంక్షేమ రంగాల్లో అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని, అందుకు అదనపు నిధులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవితో సీతక్క భేటీ అయ్యారు.

మిషన్ వత్సల్య పథకం కింద 22 వేల మంది అనాథ పిల్లల సంరక్షణ కోసం రూ.105 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పీవీటీజీ ప్రాంతాల్లో 216 అంగన్‌‌‌‌వాడీ కేంద్రాల నిర్మాణానికి రూ.5 కోట్లు, పోషణ అభియాన్ కింద పెండింగ్‌‌‌‌లో ఉన్న రూ.71 కోట్లతో పాటు అదనంగా రూ.17 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. కౌమార బాలికల నైపుణ్యాభివృద్ధికి రూ.220 కోట్లు, అడోలెసెంట్ గర్ల్స్ ప్రోగ్రాం కింద రూ.7 కోట్లు విడుదల చేయాలని కోరారు. గత ఆర్థిక సంవత్సారానికి చెందిన 4వ త్రైమాసిక నిధులు రూ.54 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1వ త్రైమాసికానికి రూ.200 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. ములుగు జిల్లాకు నిర్భయ ఫండ్ కింద రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, పెండింగ్ నిధులును త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కేంద్ర మంత్రికి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. అనంత‌‌‌‌రం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, తెలంగాణ చేనేత చీరను కేంద్ర మంత్రికి బహూకరించారు. అలాగే, కేంద్ర సాంస్కృతిక ప‌‌‌‌ర్యాట‌‌‌‌క శాఖ మంత్రి గ‌‌‌‌జేంద్ర సింగ్ షేకావ‌‌‌‌త్‌‌‌‌తో కూడాసీత‌‌‌‌క్క భేటీ అయ్యారు.

ములుగు జిల్లాలో ప‌‌‌‌ర్యాటక అభివృద్ధికి ఆర్థిక స‌‌‌‌హ‌‌‌‌కారం అందించాల‌‌‌‌ని విన‌‌‌‌తి ప‌‌‌‌త్రం అంద‌‌‌‌జేశారు. ప్రభుత్వం చేప‌‌‌‌ట్టిన మేడారం మాస్టర్ ప్లాన్ పనుల కోసం రూ.25 కోట్లు మంజూరు చేయాల‌‌‌‌ని కోరారు. మంగ‌‌‌‌పేట మండ‌‌‌‌లం మ‌‌‌‌ల్లూరు శ్రీల‌‌‌‌క్ష్మి న‌‌‌‌ర‌‌‌‌సింహస్వామి ఆల‌‌‌‌య అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేయాల‌‌‌‌ని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో సీతక్క ధన్యవాదాలు తెలిపారు.