
- మన తిండే ఇప్పుడు ధనవంతులూ తింటున్నరు
- ఇందిర గిరి జల వికాసం ద్వారా పంపు సెట్లు ఇస్తున్నం
- గిరిజనుల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అని వెల్లడి
- ఘనంగా ఆదివాసీ దినోత్సవం.. మంత్రి అడ్లూరి, డిప్యూటీ స్పీకర్ రామచంద్రు నాయక్ హాజరు
హైదరాబాద్, వెలుగు: జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఏ దేశంలో ఉన్నా మన పూర్వ స్థితి, మూలాలు, అస్తిత్వం మరిచిపోవద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆదివాసీలు, గిరిజనులం అని చెప్పుకునేందుకు భయపడొద్దని, మన జాతి గురించి గొప్పగా గర్వంగా చెప్పుకోవాలని సూచించారు. శనివారం బంజారాహిల్స్ లోని కుమ్రం భీమ్ భవన్ లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరిగాయి. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్, డిప్యూటీ స్పీకర్ రాంచంద్రు నాయక్, ఎమ్మెల్యే ఆది నారాయణ తదితరులు హాజరయ్యారు.
ఆదివాసీ వేషదారణలో డ్యాన్సులు వేస్తూ, బాణం సంధిస్తూ మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు మన తిండి గురించి తక్కువ చేసి మాట్లాడేవాళ్లు.. పేదోళ్లు, వెనుకబడ్డ వాళ్లు తినే ఫుడ్ అనేవారు. ఇప్పుడు అదే జొన్న, సజ్జ రొట్టెలు, అంబలి, చద్దన్నాన్ని స్టార్ హోటళ్లలో రకరకాల పేర్లతో తింటున్నరు. మన పూర్వీకులు ఎంత గొప్ప ఆహారం తీసుకున్నారో, ఎంత ఆరోగ్యంగా జీవించారో ఇప్పుడు స్పష్టమవుతున్నది.
గిరిజనులు ఎంతో మంచి ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉన్నరు. బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆదివాసీ ప్రాంతాల్లో బతకాలి” అని సీతక్క తెలిపారు. ట్రైబల్స్ కోసం 20 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి ఎంతో చేస్తున్నారని, డైట్ కాస్మోటిక్ చార్జీలు పెంచటంతో పాటు, ఇందిర గిరి జల సౌర వికాసం పేరుతో పంపుసెట్లు, ఉచిత విద్యుత్ ఇస్తున్నారన్నారు.
క్రీడాకారులను ఆదుకోవాలి
గత ప్రభుత్వం పదేండ్లుగా ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిందని, ట్రైబల్ శాఖను నిర్వీర్యం చేశారని, తమ ప్రభుత్వం అన్నింటిని సరి చేస్తుందని డిప్యూటీ స్పీకర్ రామచంద్రు నాయక్ తెలిపారు. ఆదివాసీ గిరిజన క్రీడాకారులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మంత్రులను కోరారు. తండాల అభివృద్ధి, ఉపాధి హామీ, పోడు పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అయ్యాయన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కళావతి, ఆసిఫాబాద్ కు చెందిన కైలాశ్ టీచర్, మిల్లెట్ బిస్కెట్లు తయారు చేసిన వెంకటలక్ష్మి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బాగుబాయ్ కు ఒక్కొక్కరికి రూ.20 వేల చెక్కును అందజేశారు.
వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆదివాసీలు తమ ప్రదర్శనలతో అలరించారు. ఆదివాసీ, గిరిజన, లంబాడా, కోయ, గోండు, కొలాం, చెంచులు పలు కళారూపాలు, నృత్యాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు బెల్లయ్య నాయక్, ముత్తినేని వీరయ్య, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ అలుగు వర్షిణి, ఎస్టీ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి, ట్రైబల్ అధికారులు సర్వేశ్వర్ రెడ్డి, సముజ్వల హాజరయ్యారు.
వచ్చే ఏడాది 10 వేల మందితో..
మానవ జాతి అందించిన అమూల్యమైన జ్ఞానం, వారసత్వాన్ని గుర్తించి గౌరవించడమే ఆదివాసీ దినోత్సవ లక్ష్యమని సీతక్క అన్నారు. ఆదివాసీలు సాగు చేసుకునే భూముల జోలికి వెళ్లొద్దని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని, భూములపై పూర్తి హక్కులు ఉండేలా పట్టాలు ఇస్తున్నారన్నారు. రాఖీ పండుగ ఉండడంతో కార్యక్రమానికి తక్కువ మంది హాజరయ్యారని, వచ్చే ఏడాది 10 వేల మందితో ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరుపుతామని సీతక్క అన్నారు.
గిరిజనులు, ఆదివాసీలకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో చేశాయన్నారు. తండాల అభివృద్ధి, రోడ్లు, కరెంట్, ఇండ్లు అంతా కాంగ్రెస్ ప్రభుత్వాల టైమ్ లోనే అందాయన్నారు. ఈ ఏడాది ఎస్టీ ఎస్డీఎఫ్ కింద రూ.17,168 కోట్లు కేటాయించారని.. రాష్ట్ర చరిత్రలోనే ఇదే అత్యధికమన్నారు. ట్రైబల్ శాఖ కు రూ.6,860 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. అడవి హక్కుల చట్టం కింద ఉన్న భూములకు సోలార్ పంపుల ద్వారా సాగు సౌకర్యం కల్పిస్తున్నామని, వచ్చే మూడేండ్లలో నిధులు రూ.12,600 కోట్లకు పెంచి రెండు లక్షల మంది రైతులు, ఆరు లక్షల ఎకరాల భూమి కవర్ చేస్తామని మంత్రి వెల్లడించారు.