మహిళల ఆత్మగౌరవాన్నిదెబ్బతీస్తే ఉపేక్షించేది లేదు: మంత్రి సీతక్క 

మహిళల ఆత్మగౌరవాన్నిదెబ్బతీస్తే ఉపేక్షించేది లేదు: మంత్రి సీతక్క 
  • గాయపడ్డ సిబ్బందిని అసెంబ్లీ ప్రాంగణంలో పరామర్శించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సోమవారం జరిగిన ఘటనలో గాయపడిన మహిళా పోలీసులను మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆమె పరామర్శించారు. విధి నిర్వహణలో ఉన్న తమపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడికి పాల్పడ్డారని బాధితులు ఈ సందర్భంగా కన్నీటిపర్యంతమయ్యారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మంత్రికి చూపించి తమ ఆవేదనను వెలిబుచ్చారు.

బాధిత మహిళా పోలీసుల వివరాలు విన్న మంత్రి సీతక్క వారికి ధైర్యం చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎవరి బెదిరింపులకూ భయపడకుండా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, మహిళలతో అనుచితంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.