అప్పుడు మీకు గుర్తుకురాలేదా? : శ్రీధర్ ​బాబు

అప్పుడు మీకు గుర్తుకురాలేదా? : శ్రీధర్ ​బాబు

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితపై మంత్రి శ్రీధర్ బాబు హాట్​కామెంట్స్​చేశారు. అసెంబ్లీలో జ్యోతిబాపూలే విగ్రహం ఏర్పాటు విషయం బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. అప్పుడు ఎవరు అడ్డుకున్నారో ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో విగ్రహం వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఫూలే విగ్రహ ఏర్పాటును అప్పటి సీఎం అడ్డుకున్నారా లేక స్పీకర్ అడ్డుకున్నారా అనేది స్పష్టం చేయాలి. జ్యోతిబాపూలే జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించిందే కాంగ్రెస్. మహనీయులను స్మరించుకోవడంలో కాంగ్రెస్‌కు ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయనే ఆలోచనతో రాజకీయంగా లబ్ధి పొందేందుకే జ్యోతిబాపూలే అంశం తెరపైకి తీసుకువచ్చారు.

అసెంబ్లీ పరిసరాలు పూర్తిగా స్పీకర్, మండలి చైర్మన్ ఆధీనంలోనే ఉంటాయి. మండలి చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ మనిషే కదా.  నిజామాబాదులో కవిత గెలవననే ఓడిపోయే సీటును బీసీలకు కేటాయిస్తామంటున్నరు. గవర్నర్ తీసుకునే నిర్ణయాలను వక్రభాష్యం పలకడం కేటీఆర్‌కు సమంజసం కాదు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు అనేది కేబినెట్‌లో చర్చించి ప్రకటిస్తం’ అని మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడించారు.