పాలమూరు కష్టాలకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణం : నిరంజన్ రెడ్డి

పాలమూరు కష్టాలకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణం : నిరంజన్ రెడ్డి

వనపర్తి :  గత పాలకుల నిర్లక్ష్యం, పాలమూరు ప్రాజెక్టుల పట్ల వివక్ష మూలంగా పాలమూరు ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా శ్రీ రంగాపురం మండల కేంద్రంలోని రంగసముద్రం రిజర్వాయర్ లో మంత్రి రెండు లక్షల చేప పిల్లలను వదిలారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  కృష్ణా నదికి పెద్దఎత్తున వరదలు వస్తున్నా నీటిని ఎత్తిపోసుకుని నిల్వచేసుకోలేని దుస్థితి పాలమూరు ప్రాంతంలో ఉందన్నారు.  ఏ హక్కులు లేకున్నా రాయలసీమ, ఆంధ్రలో 400 టీఎంసీలు నిల్వచేసుకునే రిజర్వాయర్లు నిర్మించారని,  అదే పద్ధతిలో కనీసం వంద టీఎంసీల సామర్ధ్యం ఉన్న రిజర్వాయర్లు నిర్మించి ఉన్నా పాలమూరు సస్యశ్యాలం అయ్యేదని అన్నారు.

పాలమూరులోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల కింద కనీసం 10 టీఎంసీలు నిల్వచేసుకునే పరిస్థితి లేదని నిరంజన్ రెడ్డి అన్నారు.  గత పాలకుల అసమానతలు సరిచేసేందుకే సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని,  నూతన రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మంత్రి అన్నారు.  కల్వకుర్తి ఎత్తిపోతల కింద 40 ఆన్ లైన్ రిజర్వాయర్లు నిర్మించనున్నామని,  త్వరలోనే సీఎం జిల్లాలో రెండురోజులు పర్యటించి, ఈ ప్రాంతంలో గల సమస్యలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ శ్వేతామొహంతి, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి హాజరయ్యారు.