దేశానికి ఆదర్శంగా తెలంగాణ వ్యవసాయం 

దేశానికి ఆదర్శంగా తెలంగాణ వ్యవసాయం 

రంగారెడ్డి జిల్లా : ప్రపంచ వ్యవసాయానికి నానో యూరియా ఆదర్శమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 11 వేల మంది రైతుల పొలాల్లో నానో యూరియాను ప్రయోగించి.. ఫలితాలు పరిశీలించిన తర్వాత మార్కెట్ లోకి విడుదల చేశామని తెలిపారు. తొలిసారి యూరియాను ద్రవ రూపంలో నానో టెక్నాలజీలో అందుబాటులోకి తీసుకొచ్చామని, దీని వల్ల ఎరువుల సంచులను తరలించే పెద్ద ప్రక్రియను సులభతరం చేశామన్నారు. దేశంలో పంటల ఉత్పాదకత  పెంచేందుకు ఆధునిక వంగడాలు, రసాయనిక ఎరువుల వాడకం మొదలైందన్నారు. దేశ జనాభా ఆహార అవసరాలను తీర్చేందుకు నూతన పద్ధతులను అనుసరించాలని, భూమికి అవసరమైన పోషకాలు ఏమిటి..? ఎంత వాడాలి..? అన్నదానిపై రైతులకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.  రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వ్యవసాయంలో ఇఫ్కో  నానో యూరియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు, రైతు బంధు సభ్యులు, సహకార సంఘాలు, ఆగ్రో సేవా కేంద్రాలు, డీలర్స్ కు ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, రైతులు హాజరయ్యారు. 

దేశంలో వినియోగించే 70 శాతం యూరియా విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. అత్యధిక ఎరువులు, యూరియా వాడకం కారణంగా చెరువులు, కుంటలు, భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి అనేక దుష్పరిణామాలను అరికట్టి.. రైతాంగానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణలో నానో యూరియాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ యూరియాను మోతాదుకు మించి వాడుతున్నారని, ఈ నేపథ్యంలోనే నానో యూరియా వైపు రైతులను మళ్లించాలని నిర్ణయించామని చెప్పారు. 

నానో యూరియా వాడకం వల్ల మొక్కలకు పత్రహరితం ఎక్కువగా అంది...పంట వేగంగా ఎదుగుతుందని మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వివరించారు. యూరియా గడ్డకట్టడం, రవాణా ఖర్చులు అధిగమించడం, గోదాముల్లో నిల్వ ఇబ్బందులు, విదేశీ దిగుమతులు తగ్గించుకోవచ్చని చెప్పారు. 500 మిల్లీ లీటర్ల నానో యూరియా ఒక యూరియా బస్తాతో సమానం అన్నారు. యూరియా కేవలం 30 నుండి 50 శాతం మాత్రమే మొక్కకు ఉపయోగపడుతుందని, నానో యూరియా మాత్రం 80 శాతం వరకు పని చేసి మొక్క ఎదుగుదలకు చాలా తోడ్పడుతుందని తెలిపారు. తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శం అన్నారు. నానో యూరియా వాడకంతో రాష్ర్టం మరోసారి దేశానికి దిక్సూచిలా నిలబడాలని కోరారు.