కేసీఆర్​వి బురదజల్లే ఆరోపణలు: మంత్రి సీతక్క

కేసీఆర్​వి బురదజల్లే ఆరోపణలు: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే సమర్థంగా తమ ప్రభుత్వం ప్రతి ఇంటికి నీళ్లు సరఫరా చేస్తున్నదని గ్రామీణ నీటి సరఫరా (ఆర్ డబ్ల్యూఎస్) మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సూర్యాపేటలో మిషన్ భగీరథపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే తీసుకునేందుకు సిద్ధంగా తాము ఉన్నామని.. అంతే తప్ప అర్థంపర్థం లేని విమర్శలు, బురదజల్లే ఆరోపణలు సరికాదని అన్నారు.

ప్రతిరోజూ పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్స్ తో నీటి సరఫరాపై సమీక్షిస్తూ, ఎప్పటికప్పుడు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నామని గుర్తు చేశారు. రిజర్వాయర్ లలో ఉన్న నీటి నిల్వలను గత ప్రభుత్వం కంటే సమర్థంగా సద్వినియోగం చేసుకొని తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఏ గ్రామంలో కూడా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడంలేదన్నారు. పైపులైన్లలో లీకేజీలు ఏర్పడితే గంటల వ్యవధిలోనే రిపేర్లు చేసి నీటి సప్లై పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసినటువంటి డిజైన్ లోపం వల్ల ఆదిలాబాద్ జిల్లా కెరామెరి ప్రాంతలో నీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని, కొత్త ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే రూ.60 కోట్లు విడుదల చేసి డిజైన్ లోపాలను సరిదిద్దుతున్నామని మంత్రి వివరించారు. గత ప్రభుత్వం గ్రామంలో ఉన్న తాగు నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణపై పాలసీ ఇవ్వకపోవడం వలన రిపేర్లు చేపట్టలేదని, మా ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే నిర్వహణపై స్పష్టమైన సూచనలు ఇచ్చామని, దీనితో రిపేర్లు త్వరితంగా చేపట్టి నీటి ఎద్దడి లేకుండా చేస్తున్నామన్నారు.