ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకోవాలి : సీతక్క

ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకోవాలి : సీతక్క
  • అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం 
  • ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం

ఆసిఫాబాద్, వెలుగు: ఆర్డర్స్ ఇస్తే పనిచేసే అధికారులుగా ఉండవద్దని, క్రియేటివిటీతో ఆలోచించి ప్రజలకు మంచి జరిగేలా చూడాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. ఆసిఫాబాద్ మండలంలోని అప్పపెల్లి వాగుపై రూ.1.82 కోట్లతో నిర్మిస్తున్న హైలెవల్ వంతెన పనులను బుధవారం జడ్పీ చైర్మన్ కృష్ణారావు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఇతర అధికారులతో కలిసి మంత్రి సీతక్క పరిశీలించారు. 

అనంతరం జిల్లా కేంద్రంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న ప్రెస్ క్లబ్ భవనానికి భూమి పూజ చేశారు. వాడిగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల కింద రూ.6.20 లక్షలతో నిర్మించిన గదులను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులకు యూనిఫామ్స్​, బుక్స్ అందజేశారు. వాంకిడి మండలం సవతి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభించి ఆదివాసీ ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 

పేద బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కలిసి జిల్లాను అభివృద్ధిలో ముందుకు నడిపించాలన్నారు. 

వర్షాకాలం కావడంతో రానున్న మూడు నెలలు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై డాక్టర్లు అవగాహన కల్పించాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు, ఐటిడిఎ పీఓ ఖుష్బూ గుప్తా, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, నాయకులు శ్యామ్ నాయక్ ,చరణ్ తదితరులు పాల్గొన్నారు.