రాహుల్​ను ప్రధానిని చేద్దాం: మంత్రి ​శ్రీధర్​బాబు

రాహుల్​ను ప్రధానిని చేద్దాం: మంత్రి ​శ్రీధర్​బాబు

కాటారం, వెలుగు:  రాహుల్​గాంధీని ప్రధానిని చేద్దామని ఐటీ మినిస్టర్​ దుద్దిళ్ల శ్రీధర్​బాబు కాంగ్రెస్​ కార్యకర్తలకు సూచించారు. పెద్దపల్లిలో పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించుకుందామన్నారు. ఇందుకోసం ప్రతీ కాంగ్రెస్​ కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం మంత్రి సొంత గ్రామమైన జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిందని, ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమల్లోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందని, గవర్నమెంట్​ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి గవర్నమెంట్​ఎంప్లాయీస్​కు ఫస్ట్​ తారీఖునే జీతాలు పడేలా కృషి చేశామని చెప్పారు. 

అలాగే, కాంగ్రెస్​ ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని.. మహిళలను కోటీశ్వరులని చేస్తామని మంత్రి చెప్పారు. ఎన్నికల కోడ్​ అయిపోగానే అన్ని హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మంథని నియోజకవర్గానికి తాగు, సాగు నీరు అందించేందుకు రూపకల్పన చేసిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్​ను గత బీఆర్ఎస్​ప్రభుత్వం విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పనులు స్టార్ట్​ చేయించానని చెప్పారు. కాటారం మండలంలో రెవెన్యూ, పోలీస్​ యంత్రాంగం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గించకుండా న్యాయపరమైన సమస్యలు తీర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్​ పార్టీ మండలాధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్​రెడ్డి, నాయకులు కోట రాజబాపు, చీమల సందీప్, కార్యకర్తలు పాల్గొన్నారు.