
- హెచ్-1బీ వీసా ఫీజుల పెంపుతో రాష్ట్రానికి, యువతకు భారీ నష్టం: మంత్రి శ్రీధర్ బాబు
- ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం సరికాదని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతీయ ఐటీ నిపుణులు, ముఖ్యంగా తెలంగాణ యువత తీవ్రంగా ప్రభావితమవుతారని ఆయన పేర్కొన్నారు.
ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి లేఖ రాస్తామని తెలిపారు. సెక్రటేరియెట్లో శనివారం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ‘‘ ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియమిత్రుడు ప్రధాని మోదీకి తప్ప ఎవరికీ అర్థం కాదు. హెచ్-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్ల ఫీజు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? దీని వెనుకున్న మర్మమేంటి? హెచ్-1బీ వీసాలు పొందే దేశాల్లో మనదే మొదటి స్థానం.
ఆ ప్రభావం మనపైనే ఎక్కువగా ఉంటుంది. అయినా ముందస్తుగా అమెరికాతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైంది’’ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హెచ్- 1బీ వీసాదారులకు మినహాయింపులను సాధించడంలోనూ కేంద్రం చొరవ తీసుకోవడం లేదన్నారు. భారత్ కు నష్టం చేకూర్చేలా ట్రంప్ ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధించారని, ఇప్పుడేమో హెచ్–1బీ వీసా ఫీజును పెంచారని.. అయినా, ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
చిన్న, మధ్య తరహా కంపెనీలకూ నష్టం
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత దేశానికే కాకుండా.. చిన్న, మధ్య తరహా కంపెనీలకు కూడా నష్టం జరుగుతుందని శ్రీధర్ బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో అమెరికాతో దౌత్యపరమైన చర్చలు జరపడం లేదని, ఇది మన దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందన్నారు. "ఇది మన మంచికే" అని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.
రాజ్యాంగం ప్రకారం భారతదేశం అంటే రాష్ట్రాల సమూహమని.. కానీ, కేంద్రం మాత్రం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలనే పట్టించుకుంటుందని, తెలంగాణను విస్మరిస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో, అమెరికాతో చర్చలు జరిపి, ఇప్పటికే ఉన్నహెచ్1బీ వీసాదారులకు తాత్కాలిక ఉపశమనం కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.