- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : వడ్ల కొనుగోలు ప్రక్రియను స్పీడప్ చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశించారు. కాళేశ్వరంలోని మెగా విశ్రాంతి భవనంలో శుక్రవారం భూపాలపల్లి కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని సులభంగా విక్రయించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని, తక్షణ చెల్లింపులు జరిగేలా ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో తగిన సదుపాయాలు కల్పించాలని, కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలని, ఆర్డీవోల పర్యవేక్షణలో కొనుగోళ్లు జరిగేలా చూడాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో కాటారం ఆర్డీవో రవీందర్ పాల్గొన్నారు.
