పర్యావరణహిత నిర్మాణాలు చేపట్టాలి..కాంపోజిట్, స్టీల్ స్ట్రక్చర్లపై దృష్టి పెట్టాలి: మంత్రి శ్రీధర్బాబు

పర్యావరణహిత నిర్మాణాలు చేపట్టాలి..కాంపోజిట్, స్టీల్ స్ట్రక్చర్లపై దృష్టి పెట్టాలి: మంత్రి శ్రీధర్బాబు
  • హైదరాబాద్​లో 100 మీటర్లకన్నా ఎత్తున్న బిల్డింగులు 200కుపైనే
  • మరో 250 వరకు నిర్మాణ దశలో ఉన్నాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, కాలుష్యం తదితర ఎన్నో సమస్యలకు పర్యావరణహిత నిర్మాణాలే పరిష్కారమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని, ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావాలని సివిల్​ ఇంజనీర్లను ఆయన కోరారు. మూడున్నరేండ్లలో 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు పంపిణీ చేస్తామన్నారు. 

శుక్రవారం అసోసియేషన్​ ఆఫ్​ కన్సల్టింగ్​ సివిల్​ ఇంజినీర్స్​(హైదరాబాద్) సెంటర్  ఆధ్వర్యంలో రాయదుర్గంలోని ఇంజనీరింగ్​ స్టాఫ్​ కాలేజ్​ ఆఫ్​ ఇండియాలో ‘నెక్స్ట్ - జెన్​ హైరైజ్​ బిల్డింగ్స్ : అడ్వాన్స్ మెంట్స్  ఇన్  కాంపోజిట్, స్టీల్  స్ట్రక్చర్స్’ అంశంపై సదస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అన్ని మెట్రో సిటీల్లోనూ హైరైజ్​ భవనాల నిర్మాణం  పెరుగుతున్నదన్నారు.

 హైదరాబాద్​లో 100 మీటర్ల కన్నా ఎత్తున్న బిల్డింగులు 200 కన్నా ఎక్కువే ఉన్నాయన్నారు. మరో 250 బిల్డింగులు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలోనే పర్యావరణహితంగా అడుగులు వేయాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి భవనాల్లో ఆర్​సీసీ నిర్మాణాలకు బదులుగా కాంపోజిట్, స్టీల్​ స్ట్రక్చర్స్​కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ బిల్డింగుల నిర్మాణానికి పట్టే సమయం 40 శాతం, ఖర్చు 30 శాతం వరకు తగ్గుతుందని తెలిపారు. భూకంపాలనూ తట్టుకుంటాయన్నారు. నిర్మాణ సమయంలో వెలువడే కాలుష్యమూ తగ్గుతుందని చెప్పారు.