పారిశ్రామికాభివృద్ధిలో మేధోసంపత్తి కీలకం: మంత్రి శ్రీధర్ బాబు

పారిశ్రామికాభివృద్ధిలో మేధోసంపత్తి కీలకం: మంత్రి శ్రీధర్ బాబు
  • పరిశ్రమల అవసరాలకు, విద్యాసంస్థల శిక్షణకు మధ్య  స్కిల్ గ్యాప్  పూడ్చేలా చర్యలు: మంత్రి శ్రీధర్​ బాబు
  • రాష్ట్ర ప్రగతిలో పారిశ్రామికవేత్తలు కీలక భాగస్వాములని కామెంట్​
  • జూబ్లీహిల్స్​ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ‘ఎఫ్ టీసీసీఐ ఎక్స్ లెన్స్ అవార్డ్స్’ ప్రదానం

హైదరాబాద్, వెలుగు: భావితరాల ఆకాంక్షలకు తగ్గట్టుగా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్(ఎఫ్ టీసీసీఐ) ఆధ్వర్యంలో మంగళవారం జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ‘ఎఫ్ టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’ ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐటీ, లైఫ్ సైన్సెస్ నుంచి మాన్యుఫ్యాక్చరింగ్, డీప్-టెక్ వరకు తెలంగాణను దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. పరిశ్రమ 4.0 విప్లవంలో భాగంగా దూసుకొస్తున్న ఆటోమేషన్, డీప్-టెక్ సవాళ్లను ఎదుర్కొనేలా రాష్ట్రంలో కాంప్రహెన్సివ్ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అదే సమయంలో.. భవిష్యత్తు తరాలకు మేలు జరిగేలా స్థిరమైన, పర్యావరణహిత పారిశ్రామిక వృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు.

రాబోయే రోజుల్లో పారిశ్రామికాభివృద్ధి అనేది కేవలం భూమి, మూలధనంపైనే కాకుండా.. మేధో సంపత్తి, నాలెడ్జ్ ఎకానమీ ఆధారంగానే సాధ్యమవుతుందన్నారు. అందుకు పరిశ్రమల అవసరాలకు, విద్యాసంస్థల శిక్షణకు మధ్య ఉన్న స్కిల్ గ్యాప్ ను పూడ్చాల్సిన అవసరముందన్నారు. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను స్కిల్ క్యాపిటల్ గా మార్చాలనే సంకల్పంతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి శ్రీకారం చుట్టిందన్నారు. 

రాష్ట్రమంతటా పారిశ్రామికాభివృద్ధి

రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను తీసుకొచ్చి ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నామని మంత్రి శ్రీధర్​ బాబు చెప్పారు. పారిశ్రామికాభివృద్ధిని  కేవలం హైదరాబాద్ కే పరిమితం చేయకుండా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలను మరింత ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక ‘ఎంఎస్ఎంఈ పాలసీ’ని తీసుకొచ్చామన్నారు.

పారిశ్రామికవేత్తలకు 2017 నుంచి చెల్లించాల్సిన పెండింగ్ సబ్సిడీలను దశలవారీగా చెల్లిస్తున్నామన్నారు. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకునే కనీస వేతనాలను నిర్ణయించామన్నారు. పారిశ్రామికవేత్తలను మేం కేవలం పెట్టుబడిదారులుగా మాత్రమే చూడటం లేదని, రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములుగా భావిస్తున్నామన్నారు.