రాష్ట్ర ప్రజల్లో ఖర్చు చేసే స్థోమత పెరిగింది: మంత్రి శ్రీనివాస్​గౌడ్

రాష్ట్ర ప్రజల్లో ఖర్చు చేసే స్థోమత పెరిగింది: మంత్రి శ్రీనివాస్​గౌడ్
  • ఫ్యామిలీస్ వచ్చేలా బార్ అండ్ రెస్టారెంట్లు ఉండాలి
  • నకిలీ మద్యం అమ్మితే చర్యలు తీసుకుంటామని వెల్లడి

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రజల్లో ఖర్చు చేసే స్థోమత పెరిగిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బట్టలు, బంగారం కొనేందుకు ఎన్ని డబ్బులైనా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలోని ప్రజలను దృష్టిలో పెట్టుకుని బార్ అండ్ రెస్టారెంట్లలో క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నారు. ఫ్యామిలీస్ వచ్చేలా ఎన్విరాన్​మెంట్ కల్పించాలని తెలిపారు. విదేశాల్లో ఇలాంటి కల్చరే ఉందని చెప్పారు. ఖైరతాబాద్‌‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య హాల్‌‌లో తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 

బార్ అండ్ రెస్టారెంట్లు అంటే కేవలం మద్యం తాగడానికి కాకుండా... ఫ్యామిలీతో వచ్చేలా వాతావరణం కల్పించాలని కోరారు. తెలంగాణ వంటకాలను ప్రజలకు అందించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్ కు సంబంధించి ఏదైనా పని చేయించాలంటే ముడుపులు సమర్పించుకోవాల్సి ఉండేదని తెలిపారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో వాటికి ఆస్కారం లేకుండా పనులు జరుగుతున్నాయన్నారు. కల్తీ మద్యం, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే మద్యాన్ని అమ్మకూడదని, అలా అమ్మేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని చెప్పారు. బార్​లలో డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు తమ దృష్టికి వస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.   కార్యక్రమంలో బాల్ రాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.