గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాపాలకులు తెలంగాణ ఉద్యోగులను ఎంతో అణిచివేతకు గురి చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నాడు బతుకమ్మ అడనీయలేదని, నేడు స్వరాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లోనూ బతుకమ్మ సంబరాలను నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ ఏర్పడినప్పుడు ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, అసోసియేషన్ అధ్యక్షురాలు మమత, సెక్రెటరీ సత్యనారాయణతో పాటు మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

దేశంలో ఉద్యోగులకు అత్యధిక పీఆర్సీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి.. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్..ముఖ్యమంత్రి కావడం గొప్ప విషయమన్నారు. అనాడు టీజీఓ ఉద్యోగ సంఘంలో తనకు గుర్తింపు రావడానికి, ఇవాళ మంత్రి పదవి రావడానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమన్నారు. కేసీఆర్ తో కలిసి ఉద్యమం చేసిన టీజీఓ సంఘం.. ఇవాళ ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తోందన్నారు. ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పని చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు.