రూ.50వేల కోట్ల మత్స్య సంపదను సృష్టించాం: తలసాని

రూ.50వేల కోట్ల మత్స్య సంపదను సృష్టించాం: తలసాని

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు ప్రత్యేక గుర్తింపు కల్పించారని తలసాని అన్నారు. ఉద్యమ నాయకుడిగా మత్స్యకారుల పరిస్థితులు చూసిన వ్యక్తిగా.. వారిని ప్రోత్సహించాలని అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. మిషన్ కాకతీయ ద్వారా నీటి వనరులు పెరిగాయని ఆయన అన్నారు. 8 సంవత్సరాల కాలంలో రూ.50వేల కోట్ల మత్స్య సంపదను ప్రభుత్వం సృష్టించిందని చెప్పారు. చేపలు, చేపపిల్లలను 100 శాతం సబ్సిడీలో ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. 

18 ఏళ్లు నిండిన ప్రతి మత్స్యకార యువకుడికి సభ్యత్వం ఇస్తున్నామని మంత్రి తలసాని అన్నారు. అలాగే.. చెరువులను జియో ట్యాగింగ్ చేశామన్నారు. చెరువులను పంచాయితీరాజ్ వ్యవస్థ నుంచి మత్స్య శాఖకు తెచ్చామని చెప్పారు. హైవేల పై చేపల ఉత్పత్తులు అమ్మే విధంగా సబ్సిడీతో వాహనాలు, ఇతర పరికరాలు ఇచ్చామని ఆయన తెలిపారు. తెలంగాణలో పుష్కలంగా చేపలు దొరుకుతున్నాయని.. చేపల అమ్మకం కోసం బేగంబజార్ లో రూ.10 కోట్లతో అద్భుతంగా మార్కెట్ నిర్మించామని స్పష్టం చేశారు. త్వరలోనే రాంనగర్ లో మరో అద్భుతమైన మార్కెట్  నిర్మిస్తామని వెల్లడించారు. ఇక.. ప్రతి జిల్లాలో మృగశిర కార్తె సందర్భంగా మూడు రోజుల పాటు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు.