
హైదరాబాద్: ప్రతీ ఏటా ఆషాడ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల వేడుకలను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు మంత్రి తలసాని యాదవ్ తెలిపారు. జిహెచ్ఎంసీ పరిధిలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. బుధవారం బోనాల పండుగ నిర్వహణపై నగర మంత్రులు సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ… ఈ ఏడాది ఆలయాల్లో పూజరులు మాత్రమే బోనాలు నిర్వహిస్తారని.. ప్రజలు మాత్రం ఎవరి ఇంట్లో వారే బోనాలు జరుపుకోవాలని తెలిపారు. గటాల ఊరేగింపు కూడా పూజారులే దేవాలయ పరిసరాల్లో ఉరేగిస్తారని, అదేవిధంగా అమ్మవార్లకు పట్టు వస్త్రాలు కూడా వారే సమర్పిస్తారన్నారు.. ఇందుకు ప్రజలెవరూ దేవాలయాలకు రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ సమావేశానికి నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిహెచ్ఎమ్‌సీ కమిషనర్ లోకేష్ కుమార్, సీపీ మహేశ్ భగవత్ , పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.